
దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆ వ్యవస్థకు పరిరక్షకులుగా మాత్రమే ఉండాలని.. హిందువులను వేధింపులకు గురిచేస్తే.. హిందూజాతి యావత్తు ప్రతిఘటిస్తుందని పమరహంస పరివ్రాజకాచార్య శ్రీశ్రీశ్రీ కమలానంద భారతి స్వామీజీ హెచ్చరించారు. ఏలూరు నగరంలోని పవర్ పేటలో ఉన్న సంస్కృత పాఠశాలలో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఏలూరు నగరంలోని పవర్ పేట శ్రీ కంచి కామకోఠి పీఠ హేలాపురి సంస్కృతి వేద స్మార్త ప్రయోగ పాఠశాలలో గోవుల పరిరక్షణ విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. ఇప్పటి వరకు గోవులను ఉంచుతున్న స్థలం ప్రభుత్వానిదని,, గోవులను బయటకు పంపాలని అధికారులు చెప్పారు. దీంతో అక్కడున్న బ్రాహ్మణులు, తదితరులు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కాళ్లావేళ్లా పడ్డారు. అయినా ఈవో దానికి ఒప్పుకోలేదు. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. గోవులను ఉంచే విషయమై దేవాదాయ, ధర్మాదాయ ఈవో హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఏలూరు నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, ధార్మిక సంస్థల ప్రతినిధులు, వేదపండితులు, అర్చకులు, బీజేపీ నాయకులు తదితరులు శుక్రవారం వేదపాఠశాలలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. దీనికి మద్దతుగా కమలానంద భారతి స్వామీజీ, పాఠశాల గౌరవ సలహాదారులు, సంఘ సేవకులు బికెఎస్ఆర్ అయ్యంగార్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమలానంద భారతీ స్వామీజీ మాట్లాడుతూ…. 80 ఏళ్ళ చరిత్ర కలిగిన సంస్కృత పాఠశాల విషయంలో దేవాదాయ శాఖ అధికారులు వ్యవహరిస్తున్న దారుణంగా ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఈవో వ్యక్తిత్వ హననం చేస్తూ పాఠశాల లోపల సీసీ టీవీలు ఏర్పాటు చేయడం దారుణమని పేర్కొన్నారు. పాఠశాలలో స్మార్తం, వేదంతో పాటు సంస్కృత భాష ప్రచారానికి ఊతమిస్తూ.. 40 మందికి శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈఓ అత్యుత్సాహంతో వ్యవహరించి హిందువుల మనోభావాలను దెబ్బతీయాలని చూస్తున్నారని, ఇది సరైన పద్దతి కాదన్నారు. సేవలు చేసే ధార్మిక సంస్థలకు, దేవాదాయ శాఖకు సంబంధం లేదని,,,కేవలం పరిరక్షకులుగా మాత్రమే అధికారులు వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించి, ప్రస్తుతం ఈఓను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే సంస్కృత పాఠశాలను దేవాదాయ, ధర్మదాయ శాఖ పరిధి నుంచి తప్పించి, ధార్మిక పరిషత్ పరిధిలో ఉంచి ప్రస్తుతం ఉన్న కమిటీకి నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని కోరారు. బికెఎస్ఆర్ అయ్యంగార్ మాట్లాడుతూ…. దేవాదాయ, ధర్మాదాయ శాఖ అరాచకాలకు అడ్డూ, అదుపులేకుండా పోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.