ArticlesNews

తాలిబన్ల పిచ్చి పీక్స్‌.. ఆడ బొమ్మలకు సైతం బురాఖాలు వెయ్యాలని ఆదేశం!

30views

పిచ్చోడికి చేతికి రాయి ఇస్తే.. ఎక్కడ కొడతాడో తెలియదు అన్న చందంగా మారింది ఆఫ్గనిస్తాన్‌లోని తాలిబన్ల పరిపాలన. ఇప్పటికే మహిళలకు అనేక ఆంక్షలు విధించడం ఆ దేశంలో నిత్యం చూస్తుంటాం. కానీ వారి పిచ్చి ఇప్పుడు పీక్స్‌కి చేరింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాలిబన్లు కేవలం ప్రాణం ఉన్న మహిళలకే ఆంక్షలు పెట్టట్లేదు.. ప్రాణం లేని ఆడబొమ్మలకు సైతం నిబంధనలు పెడుతూ.. వారి పిచ్చిని ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఆడ బొమ్మైనా సరే ముఖం బయటకు కనిపించకుండా బురఖా ఉండాల్సిందేనని తాలిబన్లు తేల్చి చెబుతున్నారు.

ఆఫ్టనిస్తాన్‌ దేశ రాజధాని కాబూల్ లోని ఓ దుస్తుల దుకాణంలో బట్టల ప్రదర్శన కోసం పెట్టిన బొమ్మల ముఖాలకు ముసుగు కనిపిస్తోంది. మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదని, బురఖా తప్పనిసరిగా ధరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి కఠినంగా అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. యూనివర్సిటీలలో స్త్రీలకు ప్రవేశం లేదని తేల్చి చెప్పింది. జిమ్ లు, పబ్లిక్ పార్కులు, అమ్యూజ్ మెంట్ పార్కులలోకి కూడా మహిళలను అనుమతించట్లేదు.

వీటితోపాటు మహిళలపై చాలా ఆంక్షలు విధించింది. ఇప్పుడు దుకాణాలలో ప్రదర్శనకు పెట్టే మహిళల బొమ్మలకూ ముసుగు ఉండాల్సిందేనన‌డం గ‌మ‌నార్హం. ఈ మేరకు బొమ్మల ముఖాలు కనిపించకుండా ముసుగు వెయ్యాలని తాలిబన్లు తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని దుకాణదారులు చెబుతున్నారు. గత్యంతరం లేక బొమ్మల ముఖాలకు ప్లాస్టిక్ కవర్, క్లాత్ బ్యాగ్ లను కప్పుతున్నట్లు వివరించారు. గతంతో పోలిస్తే ఇప్పుడే కాస్త నయమని మరికొందరు చెబుతున్నారు. తాలిబన్లు గతంలో పాలించినప్పుడు దుకాణాలలో మహిళల బొమ్మలు ఉంచేందుకు ఒప్పుకోలేదని గుర్తుచేసుకున్నారు. ఒకవేళ ఉంచాల్సి వస్తే ఆ బొమ్మలకు తల లేకుండా చూడాలని ఆదేశించేవారని దుకాణ‌దారులు వాపోతున్నారు.

 

source – nijam today