News

ఫిబ్రవరి 1 నుంచి 4 వరకు మినీ మేడారం జాతర!

509views

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర సమ్మక్క-సారలమ్మ జాతర త్వరలోనే ప్రారంభం కానుంది. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని మేడారంలో రెండేళ్లకొకసారి జరిగే అసలు జాతర ఇప్పటికే పూర్తయింది. ఈ ఏడాది మినీ మేడారం జాతర జరగనుంది. ఈ క్రమంలో మినీ మేడారం జాతరకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఫిబ్రవరిలో మినీ మేడారం జాతరను నిర్వహించనున్నారు. సమ్మక్క-సారలమ్మకు ఇష్టమైన మాఘశుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 4వ తేదీ వరకు నాలుగు రోజులపాటు అంగరంగ వైభవంగా మినీ జాతరను నిర్వహించనున్నారు. మినీ జాతరకు సుమారు ఐదు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఫిబ్రవరి 1న మండమెలిగే పండగ నిర్వహిస్తారు. ఆ తర్వాతి రోజు సారలమ్మ అమ్మవారి గద్దెను శుద్ధి చేస్తారు. ఫిబ్రవరి 3వ తేదీన సమ్మక్క అమ్మవారి గద్దె శుద్ధి చేస్తారు. అనంతరం భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు అనుమతిస్తారు. ఈ మినీ మేడారం జాతరలో వనదేవతలను గద్దెలపైకి తీసుకురారు. అయితే, మిగిలిన పూజా కార్యక్రమాలు యథావిధిగా జరుగుతాయి. సమ్మక్క-సారలమ్మ జాతరను మేడారంతోపాటు పూనుగొండ్ల, బయ్యక్కపేట, కొండాయిలో నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు.