
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావును టీటీడీ ధార్మిక కార్యక్రమాల సలహాదారుగా నియమిస్తూ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యనిర్వాహక కమిటీ నిర్ణయానికి వచ్చనట్లు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల కోసం టీటీడీ మూడేళ్లుగా వివిధ పారాయణాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు చాగంటి కోటేశ్వరరావును సలహాదారుగా నియమిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి విశ్రాంతి గృహంలో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో హెచ్‌డీపీపీ, ఎస్వీబీసీ కార్యనిర్వాహక కమిటీ సమావేశాలు శుక్రవారం నిర్వహించారు. గ్రామీణ యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం…
మారుమూల గ్రామాలలో నివసిస్తున్న వారికి సైతం… అక్కడి యువత భాగస్వామ్యంతో మారుమూల గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారం విస్తృతంగా నిర్వహించాలని, గ్రామస్తులకు భజన, కోలాటం సామాగ్రి అందించాలని నిర్ణయించారు. మానవాళి శ్రేయస్సు కోసం యాగాలు, హోమాలు నిర్వహించాలని నిర్ణయించామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఎస్వీబీసీ తెలుగు, తమిళ ఛానళ్ల తరహాలో కన్నడ, హిందీ ఛానళ్లు ప్రాచుర్యం పొందేందుకు ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దేశం నలుమూలలతో పాటు విదేశాల నుంచి తిరుమలకు వాహనాల్లో, నడక మార్గాల ద్వారా విచ్చేస్తున్న భక్తుల యాత్రానుభవాలను ఎస్వీబీసీలో ప్రసారం చేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రపంచ వ్యాప్తంగా భక్తుల ఆదరణ ఉన్నందున ఎస్వీబీసీలో మరింత నాణ్యమైన ప్రత్యక్ష ప్రసారాలను అందించాలని, యువతలో భక్తిభావాన్ని పెంపొందించడానికి ‘అదివో అల్లదివో’ లాంటి కార్యక్రమాలను కన్నడ, హిందీ ఛానళ్లలో ప్రసారం చేయాలని నిర్ణయించారు.





