News

టీటీడీలో విద్యుత్‌ ఆదాకు పటిష్టంగా చర్యలు!

289views

టీటీడీలో విద్యుత్‌ను ఆదా చేసేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఈవో ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి టీటీడీ పరిపాలన భవనంలోని కార్యాలయంలో ఏపీఎస్‌ఈసీఎం (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఎనర్జీ కన్జర్వేషన్‌ మిషన్‌), నెడ్‌క్యాప్‌ (నాన్‌ కన్వెన్షనల్‌ ఎనర్జీ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఎపి) సంస్థల అధికారులతో ఈవో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ… విద్యుత్‌ ఆదా చర్యల్లో భాగంగా అన్ని విభాగాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా ఏపీఎస్‌ఈసీఎం సంస్థ (ఎనర్జీ సర్వీసెస్ కంపెనీ) తరహాలో టీటీడీలోని తాగునీటి పంపింగ్‌ స్టేషన్లలో గల 100 పాత పంపు సెట్లను తొలగించి కొత్తవి ఏర్పాటు చేయనుందన్నారు. నెడ్‌క్యాప్‌ సంస్థ ఆధ్వర్యంలో టీటీడీలో అన్నప్రసాదాల తయారీకి సోలార్‌ స్టీమ్‌ కుకింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. ఈ విధానం ద్వారా వంటగ్యాస్‌ ఆదా అవుతుందన్నారు. ఈ మేరకు సదరు సంస్థల అధికారులతో టీటీడీ ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు.