
భారత్, పాక్ మధ్య శాంతి ప్రయత్నాల కోసం లేదా కలిసి పనిచేయడానికి తమ దేశం భారత ప్రధాని నరేంద్ర మోదీని ఒక భాగస్వామిగా చూడటం లేదని పాక్ మంత్రి హినా రబ్బానీ ఖర్ సంచలన ప్రకటన చేశారు. మోదీకి ముందు ప్రధానమంత్రులుగా ఉన్న మన్మోహన్ సింగ్, అటల్ బిహారీ వాజ్‌పేయిలను మాత్రం తమ దేశం భాగస్వాములుగా చూసిందని చెప్పారు. దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సు వార్షిక సమావేశం దక్షిణాసియా సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. తాను పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశం వెళ్లానని, ఇరుదేశాల మధ్య శాంతి, సమన్వయం కోసం పనిచేశానని, ప్రస్తుతంతో పోల్చుకుంటే అప్పట్లో వాతావరణమే బాగుండేదని చెప్పారు. భారత్‌తో మూడు యుద్ధాల తర్వాత పాఠాలు నేర్చుకున్నామని, పొరుగు దేశం (భారత్)తో శాంతిని తాను కోరుకుంటున్నానని పాక్ ప్రధాని షెహబాజ్ షరీప్ కొద్ది రోజుల క్రితం చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హినా రబ్బానీ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
భారత్లో రాజనీతిజ్ఞత కొరవడింది..
”మూడేళ్లలో మనం చేసిందేమిటి? శత్రుత్వం పెంచుకుంటూ వచ్చాం. భౌగోళికతను (జియోగ్రఫీ)ని మనం మార్చలేమనే విషయం గుర్తుంచుకోవాలి. ఇది దక్షిణాసియా సమస్య కాదు, భారత్-పాకిస్థా్న్ మధ్య ఉన్న సమస్య. భారత్ వైపు నుంచే సమస్య ఉంది. అక్కడ రాజనీతిజ్ఞత కొరవడింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత దేశానికి మంచే కావచ్చు, కానీ ఆయనను పాక్ భాగస్వామిగా చూడటం లేదు” అని హినా రబ్బీనీ తన ప్రసంగంలో వివరించారు.
శాంతి కోసం ఆలోచించాలి…
ఎన్నికల కోణంలో ప్రతి విషయాన్ని చూడకుండా శాంతి కోసం ఆలోచించాలని భారత్‌కు హినా రబ్బానీ సూచించారు. గతం నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్లాలని పాక్ కోరుకుంటోందని, భారత్‌తో ఒకప్పుడు అన్ని మతాల వారు కలిసి సహజీవనం చేసేవారని, అయితే ఈ పరిస్థితి ఎంతో కాలం కొనసాగేలా ఇప్పుడు కనబడటం లేదని తప్పుపట్టారు. అలాగని పాకిస్థాన్‌లో ఎలాంటి సమస్యలు లేవని తాను చెప్పడం లేదని, అయితే మైనారిటీల రక్షణకు తమ ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తూనే ఉందని, ఉన్న చట్టాలతోపాటు కొత్త చట్టాలను తీసుకువచ్చి మైనారిటీలకు రక్షణ కల్పిసున్నామని చెప్పారు.