News

పన్ను స్లాబుల్లో నూతన విధానానికి అవకాశం.. వేతనజీవులకు మేలు జరుగుతుందా?

180views

మరో 10 రోజుల్లో కేంద్ర బడ్జెట్ 2023-24 పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ వివరాలు తెలియజేయనున్నారు. దీంతో సమయం సమీపిస్తున్న కొద్దీ బడ్జెట్‌పై అంచనాలు, ఆశలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆదాయ పన్ను స్లాబుల్లో మార్పులు చేర్పులపై టాక్స్‌ పేయర్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్ను స్లాబుల సవరణలపై అంచనాలు, విశ్లేషణలు ఏవిధంగా ఉన్నాయో ఒకసారి పరిశీలిద్దాం.

ప్రత్యామ్నాయ నూతన పన్ను విధానం కింద పన్ను రేట్లను తగ్గించే అవకాశాలున్నాయని, ఆదాయ పన్ను స్లాబుల్లో సవరణలు చేపట్టే అవకాశముందని రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంది. కాగా నూతన పన్ను విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2020లో ప్రవేశపెట్టారు. ఈ విధానం కింద వ్యక్తిగత చెల్లింపుదార్లకు 5 స్లాబులు అందుబాటులో ఉన్నాయి. రూ.2.5 లక్షల – రూ.5 లక్షల మధ్య ఆదాయంపై 5 శాతం ట్యాక్స్, రూ.5 లక్షల – రూ.7.5 లక్షల ఆదాయంపై 10 శాతం ట్యాక్స్, రూ.7.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆదాయంపై 15 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12.5 లక్షల ఆదాయంపై 20 శాతం ట్యాక్స్, రూ.12.5 లక్షల నుంచి రూ.15 లక్షల ఆదాయంపై 25 శాతం ట్యాక్స్, రూ.15 లక్షలకుపైబడిన ఆదాయంపై 30 శాతం ట్యాక్సులుగా ఉన్నాయి. ఇక పాత పన్ను విధానంలో కేవలం 3 స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇవి 5 శాతం, 20 శాతం, 30 శాతం ట్యాక్సు రేటులుగా ఉన్నాయి. అయితే పాత, కొత్త ఈ రెండు విధానాల్లోనూ బేసిక్ పన్ను మినహాయింపు మొత్తం రూ.2.5 లక్షలుగానే ఉంది. పాత విధానంలో రూ.10 లక్షలు పైబడిన ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ రేటు వర్తిస్తుండగా.. కొత్త విధానంలో రూ.15 లక్షలు పైబడిన ఆదాయంపై 30 శాతం ట్యాక్స్ రేటు వర్తిస్తున్న విషయం తెలిసిందే.

లక్ష్యం ఇదే..
కొత్త విధానం కింద వేర్వేరు మినహాయింపులు సాధ్యపడకపోవడమే పాత, కొత్త పన్ను విధానాల్లో ప్రధాన వ్యత్యాసంగా ఉంది. కాబట్టి చెల్లింపుదారులు ఎవరైనా కొత్త విధానాన్ని ఎంచుకుంటే హెచ్‌ఆర్ఏ (హౌస్ రెంట్ అలవెన్స్) లేదా సెక్షన్ 80సీ (హోమ్ లోన్ రీపేమెంట్స్, పీపీఎఫ్, ఈపీఎఫ్, ఎన్ఎస్‌సీ, ఇన్సూరెన్స్ ప్రీమియం, స్కూల్ ఫీజు వంటివి), సెక్షన్ 80డీ (హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం), 80 సీసీడీ, ఆదాయ పన్ను చట్టంలోని ఇతర సెక్షన్ల కింద మినహాయింపుల ప్రయోజనాలను పొందే అవకాశం లేకుండాపోయింది. ఇక ఏ పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలనేది చెల్లింపుదారుడి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి ట్యాక్స్ సేవింగ్స్ స్కీమ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న వేతన జీవులు సాధారణంగా పాత పన్ను విధానానికే మొగ్గుచూపుతున్నారు. అందుకే కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు పన్ను రేట్ల తగ్గింపు, కొత్త స్లాబులను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంది. మార్పులు తీసుకొస్తే కొత్త పన్నుల విధానం మరింత సంక్లిష్టంగా మారుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్యాక్స్ ఫైలింగ్‌ను సులభతరం చేసేందుకు ప్రవేశపెట్టిన నూతన పన్ను విధానంలో మార్పులు తీసుకొస్తే జఠిలమవ్వడమే కాకుండా.. లక్ష్యం కూడా దెబ్బతింటుందని ఓ ప్రభుత్వాధికారి పేర్కొన్నట్టు రాయిటర్స్ తెలిపింది.