ప్రధాని నరేంద్ర మోదీ మైనారిటీ ఓటర్లపై ఫోకస్ పెట్టారు. రెండు రోజుల పాటు దిల్లోలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో మైనారిటీల ఓట్లను రాబట్టుకునేందుకు బిజెపి నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మసీదులకు వెళ్లి ముస్లింలను కలుసుకోవాలని.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలని బిజెపి నాయకులకు సూచించారు. చర్చిలకు వెళ్లి క్రైస్తవులను కలుసుకోవాలని బిజెపి నాయకులకు ప్రధాని సూచించారు. ముస్లింలు, క్రైస్తవులు ఓట్లు వేసినా, వేయకున్నా … వాళ్ల సమస్యలు తెలుసుకోవాలని వాళ్ళని నిరంతరం కలుస్తూ ఉండాలని ప్రధాని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విధానమైన సబ్కా సాత్.. సబ్కా వికాస్… నినాదాన్ని మైనారిటీలలో… విస్తృతంగా ప్రచారం చేయాలని కమలనాథులకు ప్రధాని సూచించారు.
2023లో 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, అలాగే 2024లో పార్లమెంటుకు ఎన్నికలు జరగనుండడంతో ప్రధాని మైనారిటీ ఓట్లపై ఫోకస్ చేయాలని బిజెపి నేతలకు సూచించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించి ముచ్చటగా మూడోసారి బిజెపికి అధికారం అందించాలని మోడీ తలపోస్తున్నారు. ఉత్తరాది దక్షిణాదితోపాటు ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన బిజెపి గత ఎన్నికల్లో గెలుచుకోలేకపోయిన ఎంపి స్థానాలను ఈసారి ఎలాగైనా గెలుచుకోవాలని వ్యూహాలు రచిస్తోంది.
గత రెండు పర్యాయాల్లో మైనారిటీల ఓట్లు బిజెపికి పెద్దగా పడలేదు… దీంతో బీజేపీకి, మైనారిటీలకు మధ్య ఉన్న గ్యాప్ ని తొలగించడానికి బిజెపి ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది… ఇందుకోసం బిజెపి నాయకులే స్వయంగా మసీదులకు చర్చలకు గురుద్వారాలకు ఇలా వివిధ ప్రార్ధనా స్థలాలకు వెళ్లి మైనారిటీ నాయకులను, మైనారిటీలను పెద్ద ఎత్తున కలుసుకోవడం ద్వారా బిజెపికి మైనారిటీలకు మధ్య ఉన్న దూరాన్ని తొలగించాలని బీజేపీ యత్నిస్తోంది… గ్యాప్ తొలగిపోవడం ద్వారా మైనారిటీలు బిజెపికి దగ్గరవుతారని మోడీ యోచిస్తున్నారు.
మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని ఇప్పటికే బీజేపీ నాయకులకు సూచించారు. మైనారిటీలకు సంబంధించిన సున్నితమైన అంశాల్లో ఆచితూచి మాట్లాడాలని కమలనాధులకు మోడీ సూచించారు. మోడీ సూచించినట్లుగా బిజెపి నాయకులు మైనారిటీలకు దగ్గర అయితే కమలం పంట పండినట్లేనని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.