News

150 స్థానాల్లో గెలుపొందడమే లక్ష్యం.. బీజేపీ ఆధ్వర్యంలో త్వరలో రథయాత్రలు – సీఎం బసవరాజు బొమ్మై వెల్లడి

388views

రానున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో సన్నాహాలను ప్రారంభించిన బీజేపీ…. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలని తీర్మానించింది. ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లిన కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై మీడియాతో మాట్లాడారు. బడ్జెట్‌ సమావేశాల అనంతరం రాష్ట్రంలోని నాలుగు దిక్కుల నుంచి బీజేపీ రథయాత్రలు ప్రారంభమవుతాయన్నారు. రథయాత్రల రూపురేఖలను పార్టీ అగ్రనేతలతో చర్చించి ఖరారు చేస్తామని తెలిపారు. నాలుగు రథయాత్రలకు ఎవరెవరు నాయత్వం వహించాలి, ఈ సందర్భంగా ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే ప్రధాన బాధ్యత ఎవరికి అప్పగించాలి? తదితర అంశాలకు సంబంధించి వివరాలను త్వరలోనే తెలియజేయనున్నట్లు సీఎం ప్రకటించారు. బీజేపీ రథయాత్రలు రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్నే మార్చివేస్తాయని పేర్కొన్నారు. 2023 శాసనసభ ఎన్నికల్లో 150 స్థానాలను గెలుపొందేందుకు వీలుగా తమ వ్యూహాలకు పదును పెడుతున్నామని చెప్పారు.