
ఆఫ్ఘనిస్థాన్ దేశంలో అధికారంలో ఉన్న తాలిబన్లు దారుణానికి ఒడిగట్టారు. దోపిడీలు చేసిన 9 మంది దొంగలకు తాలిబన్లు బహిరంగంగా విధించిన శిక్ష చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. దోపిడీలకు పాల్పడిన తొమ్మిది మంది పురుషులను కొరడాలతో కొట్టడంతోపాటు వారిలో నలుగురి చేతులను నరికేశారు. ఈ శిక్షను కాందహార్‌లోని అహ్మద్ షాహీ ఫుట్‌బాల్ స్టేడియంలో ప్రజలందరూ వీక్షిస్తుండగా విధించడం చర్చనీయాంశమైంది.
39 కొరడా దెబ్బలు..
దోపిడీ దొంగలకు 39 కొరడా దెబ్బలు కొట్టామని గవర్నర్ కార్యాలయ ప్రతినిధి హాజీ జైద్ తెలిపారు. ఈ శిక్ష విధిస్తున్నపుడు తాలిబన్ అధికారులు, మత పెద్దలు, స్థానిక ప్రజలు స్టేడియంలో ఉన్నారు. ఆఫ్ఘాన్ జర్నలిస్ట్ తాజుడెన్ సోరౌష్ స్టేడియం వెలుపల చిత్రాన్ని ట్విట్టర్‌లో పంచుకున్నారు. ‘‘అఫ్ఘాన్ లో చరిత్ర పునరావృతం అయింది. 1990వ సంవత్సరంలో మాదిరిగానే తాలిబాన్లు బహిరంగ శిక్షలు ప్రారంభించారు’’ అని తాజుడెన్ పేర్కొన్నారు. తాలిబన్లు గత ఏడాది డిసెంబరులో ఓ వ్యక్తిని చంపినందుకు దోషిగా తేలిన వ్యక్తిని ఉరితీశారు. తాలిబాన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బహిరంగంగా ఉరితీయడం ఇదే తొలిసారి. దొంగలకు కొరడా దెబ్బలు కొట్టి, చేతులు నరకడం మానవ ఉల్లంఘన అంటూ పౌర హక్కుల సంఘాలు పెద్దఎత్తున ఆరోపించాయి.
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.





