ArticlesNews

ప్రజలతో మమేకం కావాలి.. టార్గెట్-400పై నాయకులకు దిశానిర్దేశం చేసిన ప్రధాని మోదీ!

149views

‘దేశంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సరిగ్గా 400 రోజులే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లండి.. మన పథకాల గురించి వివరించండి… ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించండి.. మనం చరిత్ర సృష్టిద్దాం’ అని ప్రధాని నరేంద్ర మోదీ పార్టీ శ్రేణులకు పిలుపిచ్చారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల కోసం పార్టీ కార్యకర్తలను పూర్తిగా సిద్ధం చేయడమే కాకుండా, అన్ని మతాలు, వర్గాల ప్రజలను కలవాలని, విశ్వవిద్యాలయాలు, చర్చిలను సందర్శించాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు.

దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజులపాటు జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీ ప్రసంగించారు. భారత దేశపు అత్యుత్తమ శకం రాబోతోందని, ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం అంకితమివ్వాలని చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో బీజేపీ నేతలు కీలకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ఇది స్వర్ణయుగమని, ప్రపంచం మొత్తం మనవైపు చూస్తోందని చెబుతూ ఇప్పటికైనా ఏమీ చేయకపోతే చరిత్ర క్షమించదని ప్రధాని హెచ్చరించారు. ప్రజల్లో చాలా మంది ఇప్పటికీ మనం ప్రతిపక్షంలో ఉన్నామని భావిస్తున్నారని పేర్కొంటూ వారు తమ భాషలో సంయమనంతో కూడిన పదాలను ఉపయోగించాలని ప్రధాని మోదీ హితవు చెప్పారు.

‘‘సమాజంలో ప్రతి వర్గానికి చేరువకండి. ఎన్నికలతో పని లేకుండా బోహ్రాలు, పాస్మాండాలు, సిక్కులు వంటి మైనారిటీలకు చేరువ అవ్వాలని.. అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు మనం ప్రయత్నించాలి. ఈ పనులను ఓటు బ్యాంకు కోసం చేయకూడదు. అందరి కోసం పని చేయాలన్నదే మన ఉద్దేశం అయి ఉండాలి’’ అని మోదీ చెప్పారు.

ప్రస్తుతం 18-25 ఏళ్ల యువతపై బీజేపీ నేతలు దృష్టిసారించాలని ప్రధాని మోదీ బీజేపీ నేతలకు సూచించారు. వారికి చరిత్ర గురించి ఎక్కువగా తెలియదని, అలాగే గత ప్రభుత్వాలు ఏం చేశాయో కూడా వారికి తెలియదని ప్రధాని చెప్పారు. యువతకు ప్రజాస్వామ్య పద్ధతులపై అవగాహన కల్పించి సుపరిపాలనలో భాగస్వాముల్ని చేసేందుకు ప్రయత్నించాలని బీజేపీ నేతలకు ప్రధాని సూచించారు.

ప్రజలకు చేరువయ్యేందుకు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని తమకు చెప్పారని తెలిపారు. ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి, అక్కడి ప్రజలతో మరింత మమేకమవాలని ప్రధాని సూచించారు. ఆయా గ్రామాల ప్రజలతో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారికి చేర్చడానికి దోహదపడేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు.

బీజేపీకి పెద్ద సంఖ్యలో సభ్యత్వం ఉందని పేర్కొంటూ కానీ ఆ సభ్యుల సదస్సులు నిర్వహించదని పేర్కొంటూ ప్రతి జిల్లాలో వారి కోసం ఒక సదస్సు ఉండాలని, దాని కోసం పార్టీ కృషి చేయాలని సూచించారు. మన కార్యకర్తలు అతి విశ్వాసంతో ఉండకూడదని ప్రధాని ఈ సందర్భంగా హెచ్చరించారు. లింగ వివక్షను తొలగించడంలో బేటీ బచావో, బేటీ పఢావో ఎలా సహాయపడిందో, అదే విధంగా భూమాత పిలుపును కూడా వినిపించాలని చెప్పారు. వాతావరణ మార్పు వంటి సమస్యలపై బిజెపి ప్రభుత్వంతో కలిసి నడవాలని సూచించారు.

ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించి, అక్కడి ప్రజలతో మరింత మమేకమవ్వాలని ప్రధాని పేర్కొన్నారు. ఆయా గ్రామాల ప్రజలతో మరింత అనుబంధం ఏర్పరచుకోవడానికి, ప్రభుత్వ అభివృద్ధి పథకాలను వారికి చేర్చడానికి దోహదపడేవిధంగా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పినట్లు తెలిపారు. ‘‘రసాయనాలు, ఎరువులు వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయం, ఇంధన పరివర్తన కోసం ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగా బీజేపీ పని చేయాలి’’ అని మోదీ చెప్పారు. దేశం నలుమూలల నుంచి సుమారు 350 మంది నేతలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. మోదీ, అమిత్ షా సహా కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నేతలు సమావేశాల్లో పాల్గొన్నారు.