
పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే అమ్మాయిలకు రుతుస్రావ సెలవులను కేరళ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అక్కడి ఉన్నత విద్యా శాఖ పరిధిలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న అమ్మాయిలకు సెలవులు ఇవ్వాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (కుశాట్) తన విద్యార్థులకు పీరియడ్ లీవ్ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తమ శాఖ పరిధిలోని అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలని ప్రభుత్వం సూచించిందని ఉన్నత విద్యాశాఖ మంత్రి ఆర్. బిందు తెలిపారు. పలు విద్యార్థి సంఘాల డిమాండ్ల మేరకు కుశాట్‌లో పీరియడ్ సెలవులకు ఆమోదం తెలిపినట్లు ఉన్నత విద్యాశాఖ మంత్రి తెలిపారు. పీరియడ్స్ సమయంలో విద్యార్థినులు ఎదుర్కొనే మానసిక, శారీరక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని ఇతర విశ్వవిద్యాలయాల్లో కూడా సెలవులు ఇచ్చేలా సూచనలు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రఖ్యాత కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిధిలో ప్రతి సెమిస్టర్లో బాలికల హాజరు శాతం పెంచడానికి ఇది ఉపయోగపడుతుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయం కుశాట్‌లో వివిధ తరగతుల్లో 8,000 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. వారిలో సగానికి పైగా బాలికలు ఉన్నారు. కొచ్చిన్ యూనివర్శిటీ నిర్ణయాన్ని ప్రశంసించిన కేరళ ప్రభుత్వం ఇప్పుడు అన్ని యూనివర్సిటీల్లో దీన్ని అమలు చేయాలని నిర్ణయించింది.





