
పాకిస్తాన్ దేశం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆహారం దొరక్క అక్కడి ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో పాకిస్థాన్ స్వరంలో మార్పు కనిపిస్తోంది. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ చేసిన ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. పాకిస్థాన్ గుణపాఠం నేర్చుకుందని, ఇప్పుడు శాంతియుతంగా జీవించాలని కోరుకుంటోందని ఆ దేశ ప్రధాని అన్నారు.
అల్ అరేబియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. ప్రతి సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడేందుకు భారత్ సిద్ధంగా ఉందని చెప్పారు. చర్చలకు కూర్చుని ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాలని భారత నాయకత్వానికి, ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేస్తున్నాను అని తెలిపారు. భారత్ తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నట్లు పాక్ ప్రధాని పేర్కొన్నారు. ప్రశాంతంగా బతకాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. భారత్‌తో తాము మూడు యుద్ధాలు చేశామని ఆ సమయంలో ప్రతిసారీ ప్రజలకు మరింత కష్టాలు, పేదరికం, నిరుద్యోగాన్ని తీసుకొచ్చామని అని అన్నారు. ఆ యుద్దాల నుంచి చాలా నేర్చుకున్నామని, ప్రస్తుతం తాము ప్రశాంతంగా బతకాలనుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
‘మా సమస్య పరిష్కారానికి మేం సిద్ధంగా ఉన్నాం. కూర్చొని మాట్లాడుకుందామని ప్రధాని నరేంద్ర మోదీకి నా విజ్ఞప్తి. బాంబులు, ఆయుధాల తయారీ కోసం తమ వనరులను ఖర్చు చేయడం పాక్ కు ఇష్టం లేదు” అని ఆయన అన్నారు.





