
ప్రపంచ దేశాల నుంచి సాయం పొందేందుకు పాకిస్థాన్ పెద్దలు వరదలను వాడుకుంటున్నారు. 2022లో సంభవించిన వరదల వల్ల లక్షలాది మంది నిరాశ్రయులయ్యారని, మానవతావాద సాయం చేయాలని కోరుతున్నారు. వారి ప్రయత్నాలు సఫలీకృతమవుతున్నాయి కూడా. దాదాపు 8 బిలియన్ డాలర్ల విలువైన సాయం అందజేయడానికి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయి. కానీ పాకిస్థాన్ నాయకులు తీసుకున్న నిర్ణయాలే ఆర్థిక మాంద్యం వైపు ఆ దేశాన్ని నడిపాయని పాక్‌లోని ప్రముఖులో చెబుతున్నారు. ఈ పరిస్థితులను నేరుగా చెప్పలేక.. వరదలు సంభవించాలయనే సాకుతో… విదేశీ డబ్బును పాక్ అడుక్కుంటోంది.
ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పుల సదస్సులో భాగంగా 8 బిలియన్ డాలర్లకుపైగా ఆర్థిక సాయం పొందడానికి పాకిస్థాన్ హామీ పొందింది. 2022 ఆగస్టులో వరద పరిస్థితి సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ, డిఫాల్ట్ వంటి పరిస్థితులను పాకిస్థాన్ ఎదుర్కొందని ఆ దేశ మీడియా చెబుతోంది. 2022 చివరిలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొందని పేర్కొంది. ఈసారి అంతర్జాతీయ సహాయంపై వాగ్దానాలను పొందేందుకు భారీ వరదల వల్ల జరిగిన విధ్వంసాన్ని చూపుతోందని పేర్కొంది.
పాకిస్థాన్ మంత్రి ఒకరు మీడియాతో మాట్లాడుతూ…. జనీవాలో జరిగిన వాతావరణ సదస్సు పాకిస్థాన్‌కు గొప్ప విజయాన్ని అందించిందన్నారు. తమ దేశానికి సాయపడటానికి వివిధ దేశాలు, ప్రభుత్వాలు, నేతలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల పెద్దలను ఈ సదస్సు ఏకం చేసిందని తెలిపారు. మానవతావాదం, వాతావరణ మార్పుల గురించి సమర్థవంతంగా ప్రచురించి, ప్రసారం చేసినందుకు జాతీయ, అంతర్జాతీయ మీడియాకు ధన్యవాదాలు తెలిపారు.
ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ జెనీవాలో జరిగిన వాతావరణ సదస్సులో మాట్లాడుతూ.. విధ్వంసకర వరదల నుంచి పాకిస్థాన్ కోలుకోవడానికి పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సమక్షంలోనే గుటెరస్ ఈ పిలుపునిచ్చారు. 2022లో సంభవించిన వరదల్లో పాకిస్థాన్‌లో మూడింట ఒక వంతు భూభాగం మునిగిపోయిందని గుటెరస్ చెప్పారు. దాదాపు 1,700 మంది ప్రాణాలు కోల్పోయారని, సుమారు 3 కోట్ల 30 లక్షల మంది ప్రభావితులయ్యారని, సుమారు 80 లక్షల మంది నిరాశ్రయులయ్యారని తెలిపారు.





