రక్షణ దళాల వెటరన్స్ డే అత్యంత గౌరవ భావంతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ రాజధాని దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) జనరల్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల అధిపతులు ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ పుష్పగుచ్ఛాలు ఉంచి, వీర సైనికులకు నివాళులర్పించారు.
ఇక మరోవైపు ఉత్తరాఖండ్ వార్ మెమోరియల్ ట్రస్టు డెహ్రాడూన్‌లో అభివృద్ధిపరచిన శౌర్యస్థల్‌ను రక్షణ దళాలకు శనివారం అంకితం చేశారు. రక్షణ దళాల త్యాగాలు, ఆత్మబలిదానాలు, సేవలను కొనియాడుతూ ఈ స్థలాన్ని అభివృద్ధిపరిచారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి అమర సైనికులకు నివాళులర్పించారు.
వెటరన్స్ డే ఎందుకు జరుపుతారంటే..
1947లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారతీయ దళాలకు నాయకత్వం వహించి, దేశానికి విజయం లభించే విధంగా పోరాడిన ఫీల్డ్ మార్షల్ కేఎం కరియప్ప పదవీ విరమణ చేసిన రోజును వెటరన్స్ డేగా జరుపుకుంటున్నాం. ఆయన మన దేశ సైన్యానికి మొదటి కమాండర్-ఇన్-చీఫ్. ఆయన 1953 జనవరి 14న పదవీ విరమణ పొందారు.