News

కాశ్మీర్‌‌లో హిమపాతం.. ఒకరి మృతి.. చలితో వణికిపోతున్న ఉత్తరాది! !

287views

ఉత్తరాది రాష్ట్రాలను ఇప్పటికే గజగజలాడిస్తున్న చలి.. ఈ వారం మరింత విజృంభించనుంది. జనవరి 14వ తేదీ నుంచి 19 మధ్యన ఉత్తరాదిలోని పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రత – 4 డిగ్రీలకు పడిపోయే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. పొగ మంచు ప్రభావం కొనసాగనుండగా.. ఢిల్లీతోపాటు పరిసర ప్రాంతాల్లో శీతల గాలుల ప్రభావం అధికంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వచ్చే శనివారం తర్వాత వాయవ్య భారత రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీల లోపు పడిపోతాయని తెలిపింది. వచ్చే వారం రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో 21వ శతాబ్దంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే ముప్పు ఉందని లైవ్‌ వెదర్‌ ఆఫ్‌ ఇండియా వ్యవస్థాపకులు నవదీప్‌ దహియా కూడా పేర్కొన్నారు. ఇప్పటికే కశ్మీర్ లోయలో 4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

జమ్ము–కశ్మీర్ సహా ఉత్తరాది రాష్ట్రాలను చలి, మంచు వణికిస్తోంది. ముఖ్యంగా కాశ్మీర్‌‌లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. కాశ్మీర్‌‌లోని గందేర్‌‌బల్ ప్రాంతంలో హిమపాతం సంభవించడంతో ఒక వ్యక్తి మరణించారు. మరొకరు గల్లంతయ్యారు.. గురువారం ఈ ఘటన జరిగింది. కొద్ది రోజులుగా ఇక్కడి పర్వత ప్రాంతంలో హిమాపాతం ఆందోళన కలిగిస్తోంది. మంచు ఎక్కువగా కురుస్తుండటం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని అధికారులు తెలిపారు. హిమపాతం సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. హిమపాతంలో మరణించిన వ్యక్తిని ఒక కూలీగా గుర్తించారు. గల్లంతైన మరొక వ్యక్తిని గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే హిమపాతం, చలితో వణుకుతున్న జమ్ము–కశ్మీర్ వాసులకు మరో ప్రమాదం పొంచి ఉంది. గురువారం సాయంత్రం నుంచి మరింతగా మంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షం పడే అవకాశం కూడా ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు సున్నా కంటే తక్కువ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలిగుప్పిట్లో మగ్గిపోతున్నారు.