News

ప్రధాని మోదీ చేతుల మీదుగా అతిపెద్ద నదీ పర్యాటక నౌక గంగా విలాస్‌ యాత్ర ప్రారంభం.. టికెట్ ధర ఎంతంటే?

232views

ప్రసిద్ది పుణ్యక్షేత్రాలతోపాటు, అనేక పర్యాటక ప్రాంతాలను చుట్టి వచ్చే గంగా విలాస్ యాత్రను (Ganga Vilas Yatra) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వర్చువల్‌గా ఈ యాత్రను ప్రారంభించిన మోదీ. ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూయిజ్ టూర్ ఇదని తెలిపారు. ఈ టూర్ వారణాసిలో ప్రారంభం అవుతుందని.. దాదాపు 51 రోజులపాటు యాత్ర కొనసాగి దిబ్రుగఢ్‌లో టూర్ ముగుస్తుందన్నారు. భారతదేశంలోని అయిదు రాష్ట్రాలతోపాటు బంగ్లాదేశ్‌‌లోని పలు ప్రాంతాలను కవర్ చేస్తూ టూర్ సాగుతుంది. క్రూయిజ్ సుమారు 4,000 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో బంగ్లాదేశ్‌లోనే 1,100 కిలోమీటర్లు కొనసాగుతుంది. 51 రోజుల యాత్రలో 50 పర్యాటక ప్రాంతాలను కవర్‌ చేస్తుంది.

గంగా విలాస్ యాత్రలో మొదటి విడతలో స్విట్జర్లాండ్ పర్యాటకులు ఉంటారు. వీరు ప్రసిద్ధ గంగా హారతిని కూడా చూడొచ్చు. బౌద్ధులు ఆరాధించే సారనాథ్, అస్సాంలోని వైష్ణవ సంస్కృతికి కేంద్రమైన మజులి, సుందర్‌బన్స్, కాజిరంగా జాతీయ ఉద్యానవనం సందర్శించవచ్చు. ఈ క్రూయిజ్‌కు రెండేళ్లకు బుకింగ్స్ ఉన్నాయని నిర్వాహకులు చెబుతుండటం విశేషం.

ఈ టూర్ ప్యాకేజీ ఎంతంటే..

ఒక్కోక్కరికి రూ.12.6 లక్షలు టూర్‌ ప్యాకేజీ వసూలు చేస్తున్నారు. జనవరి 13న ప్రారంభమైన టూర్ మార్చి 1న ముగియనుంది. ఈ క్రూయిజ్‌లో వెళ్లే పర్యాటకులు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, జాతీయ ఉద్యానవనాలు, ప్రపంచ వారసత్వ ప్రదేశాలు, పాట్నా, గౌహతి, కోల్‌కతా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరాలను చూడవచ్చు.

కోల్‌కతాకు చెందిన అంటారా సంస్థ లగ్జరీ రివర్ క్రూయిజ్‌ ను ఆపరేట్ చేస్తోంది. ఈ షిప్ ఈ క్రూజర్‌లో మూడు డెక్‌లు, 18 లగ్జరీ సూట్‌లు ఉంటాయి. ఇందులో 36 మంది పర్యాటకులు వెళ్లొచ్చు. 40 సీటర్ మల్టీ కుజిన్ రెస్టారెంట్, మోడర్న్ స్పా, లైవ్ మ్యూజిక్, 40 క్రూ మెంబర్స్ ఉంటారు. 62 మీటర్ల పొడవున్న ఈ నౌకలో కాలుష్య రహిత వ్యవస్థలు, నాయిస్ కంట్రోల్ టెక్నాలజీ ఉంటుంది.