ArticlesNews

వివేకానంద భారతీయ సంపద… యువతకు స్ఫూర్తి ప్రదాత!

924views

సమాజం కోసం పాటుపడిన వారందరూ మహానుభావులే. అందులో కొంతమందే మహర్షులవుతారు. అలాంటే వ్యక్తే స్వామి వివేకానంద. 1863 జనవరి 12న కోల్ కతాలో ఆయన జన్మించారు. శ్రీ రామకృష్ణ పరమహంసకు ప్రియ శిష్యుడైన వివేకానంద దేశంలో హిందూ మతం పునరుజ్జీవనంలో ప్రధాన పాత్ర పోషించారు. పాశ్చాత్య ప్రపంచానికి భారతీయ వేదాంతం, ఆధ్యాత్మికత, యోగా, తత్వాలను పరిచయం చేయడంలో కీలకపాత్ర పోషించిన వారిలో ఆయన ముందు వరుసలో ఉంటారు. ఆయన ఓ గొప్ప నాయకుడు. అంతేకాదు.. స్వామిజీ ఉపన్యాసాలు, అక్షరాలు, ఆలోచనలు చాలామందిలో స్ఫూర్తినింపాయి. ఈ స్పూర్తి భారత్ కే మాత్రమే కాదు.. ప్రపంచానికి కూడా కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆయన ప్రపంచంపై కురిపించిన విలువైన, ఆదర్శప్రాయమైన ఆణిముత్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందామా..

వివేకానంద కళ్లు మూసుకుని పాఠం వినేవారు ఎందుకంటే..
స్వామి వివేకానంద (Swami Vivekananda)… 1863 జనవరి 12న జన్మించారు. ఆయన అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. అప్పట్లో బెంగాల్‌లో దైవ సమానులైన రామకృష్ణ పరమహంస దగ్గర శిష్యుడిగా మారారు. మిగతా శిష్యుల వలే అన్నీ నేర్చుకున్నారు. కానీ వివేకానంద తనకంటూ ప్రత్యేకచాటుకుంటూ గురువు వద్ద మన్ననలను పొందేవారు. స్వామి వివేకానంద చదువుకునే రోజుల్లో కళ్లు మూసి పాఠం వినేవారు. కానీ ఎప్పుడు ఏ లెసన్ తిరిగి చెప్పమన్నా… గడగడా చెప్పేసేవారు. ఆయన్ని ఏక సంతాగ్రహి అంటారు. ఏదైనా ఒకసారి వింటే… ఇక అది మైండ్‌లో ఫిక్స్ అయిపోతుంది. కళ్లు మూసుకున్నప్పుడు తనకు కాంతి లాంటిది కనిపిస్తుందని ఆయన చెప్పేవారు. స్వామి వివేకానంద చిన్నప్పుడు వాళ్ల ఇంటికి ఎవరైనా సాయం కోసం వస్తే… ఆయన ఇంట్లో పెద్ద వాళ్లకు తెలియకుండా రహస్యంగా ఇంటి కిటికీలోంచీ విలువైన వస్తువులను బయటకు విసిరేసేవారు. ఆ వస్తువుల్ని తీసుకునే పేదవాళ్లు… అలా ఆర్థిక సాయం పొందేవాళ్లు. తన గురువు రామకృష్ణ దగ్గర అన్ని బోధనలూ, భారతీయ సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలు, యోగా వంటివి తెలుసుకున్న వివేకానంద.. వాటిని అమెరికా సహా చాలా దేశాలకు వెళ్లి బోధించారు. అలా ఆయన భారత గొప్పదనాన్ని విదేశీయులకు చాటిచెప్పారు. ఈ క్రమంలో ఆయన చాలా కష్టాలు పడ్డారు. దాదాపు 6 నెలల పాటూ రోజూ ఒక అరటిపండు మాత్రమే తిని సరిపెట్టుకున్నారు.

హిందూ మతాన్ని నలుదిశలా వ్యాప్తి చేసి..
ఇండియాలో హిందూ మతంలో కీలక సంస్కరణలు, మార్పులకు వివేకానంద శ్రీకారం చుట్టారు. భారతీయుల్లో ఐక్యతను పెంచారు. జాతీయతా భావాన్ని తట్టిలేపారు. ఆయన బోధనలు, సందేశాలూ అప్పట్లో యువతను సన్మార్గంలో నడిపించాయి. అందుకే ఆయన యూత్ ఐకాన్ అయ్యారు. కేవలం ముప్ఫై తొమ్మిది సంవత్సరాలు మాత్రమే జీవిచినప్పటికీ భారతదేశ ఖ్యాతిని, మన సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పిన వ్యక్తి స్వామి వివేకానంద. భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారు.

మలుపుతిప్పిన చికాగో పర్యటన…
1893 సెప్టెంబర్ 11న అమెరికా, చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనానికి భారత ప్రతినిధిగా స్వామి వివేకానంద హాజరయ్యారు. అంత పెద్ద కార్యక్రమంలో మాట్లాడేముందు ఒక్కసారి గురువుగారిని స్మరించుకున్నారు. సాధారణంగా అమెరికన్లు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ప్రసంగం మొదలుపెడతారు. కానీ వివేకానంద … సోదర, సోదరీమణులారా (brothers and sisters) అంటూ ప్రసంగించి… అక్కడి వారందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ పదాలు వినగానే అన్ని దేశాల ప్రతినిధులు దాదాపు మూడు నిమిషాలపాటు ఆపకుండా చప్పట్లు కొట్టారు. భారతదేశ సంస్కృతీ, సంప్రదాయాలను, హైందవ సనాతన ధర్మాన్ని వ్యాప్తి చేశారు. భారత్ అద్భుతాలకు నిలయమని సందర్శిస్తే మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయని విదేశీ ప్రతినిధులను ఆహ్వానించారు. వివేకానందుడి ప్రస్తావన ఎక్కడ వచ్చినా చికాగో వేదికగా జరిగిన ప్రపంచ సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం ప్రస్తావన తప్పకుండా వస్తుంది. విదేశీ పర్యటనలు ముగించుకొని వచ్చిన ఆయన.. భారత గడ్డపై అడుగుపెట్టగానే నేలను ఆప్యాయంగా ముద్దాడిన ఘటనను ఆయన దేశభక్తికి ఓ ఉదాహరణగా ఇప్పటికీ చెబుతుంటారు.

ఆయనో స్ఫూర్తి మంత్రం… భావిభారతావనికి మార్గదర్శకం..
భారతీయ ఆధ్యాత్మికతను పునరుజ్జీవింపచేయడంలో, యువశక్తిని చైతన్యపరచడంలో వివేకానందుడి కృషి అమూల్యం, అనితరసాధ్యం. ఆయన సూక్తులు నిత్యం ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతున్నాయి. భవిష్యత్తులోనూ నింపుతాయి. ఆ మాటకొస్తే ఈ భూగోళం ఉన్నంతవరకూ ప్రతి ఒక్కరిలో ఏదో రూపంలో ఆయన స్ఫూర్తి నింపుతూనే ఉంటారు. కులాలు, మతాలు, వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్న నేటి సమాజం వివేకానందుడి సూక్తులతో మరోసారి జాగృతం కావాలి. భారతీయతత్త్వం, మన సనాతన ధర్మం మరోసారి దేదీప్యమానంగా వెలగాలి. ఆ స్ఫూర్తిమంత్రం ప్రపంచానికి కొత్త దారిని చూపాలి. అదే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి.

యువతకు ఆయన ఆదర్శం.. ఎందుకో తెలుసా?
‘నిన్ను నీవు జయిస్తే విశ్వమంతా నీకు స్వాధీనమవుతుంది’, ‘మీ బలమే మీ జీవితం.. భయమే మీ మరణం’, ‘దేనికి భయపడవద్దు. మీరు అద్భుతాలు సృష్టిచగలరు, అందుకు కావాల్సిన కాస్త సంకల్పం’ అంటూ యువతలో స్ఫూర్తిని రగిల్చిన వ్యక్తి వివేకానంద. ఆయన ప్రస్తుతం భౌతికంగా అందరి మధ్య లేకపోయినా ఎంతోమంది ఆయన సూక్తులు, ప్రభావితం చేసే వ్యాఖ్యలతో స్ఫూర్తి పొంది తమ లక్ష్యాలను నేరవేర్చుకుంటున్నారు. యువతను సరైన మార్గంలో నడిపించేందుకు తను ఎన్నో విజయ రహస్యాలను అందరితోనూ పంచుకున్నారు. ఆయన ఆలోచనలు, ఆశయాలను అనుసరించిన వారి వ్యక్తిత్వం కచ్చితంగా మారుతుంది. అంతేకాదు మీలో సానుకూల మార్పులు కూడా వస్తాయి. ఆయన మాటలు తరతరాలకు వన్నె తరగని స్ఫూర్తి మంత్రాలు. ప్రపంచంలో అన్ని రకాల సమాజానికి చెందిన వ్యక్తుల్లో నూతనోత్తేజం నింపే ఆణిముత్యాలు. ఆయన గొంతు నీకేం కావాలో చెబుతుంది. అసలు నీకు నీవెవరో తెలియజేస్తుంది. నిరాశ, నిస్పృహలతో ఓటమి అంచుల దాకా వెళ్లిన నీలో వెయ్యి ఏనుగుల బలాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. అదే వివేక వాణి. కష్టాల్లో ఉన్నప్పుడే మన శక్తియుక్తులు బయటపడతాయని వివేకానందుడు చెప్పారు. అద్భుతాలు సాధించడానికి మూలం మన నమ్మకమేనని అన్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నా.. నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగాల్సిన పనులు అవే జరుగుతాయని ఆయన చెప్పారు. నిజాయితీగా పనిచేసుకుంటూ పోతే ప్రపంచమంతా ఏకమై నీకు సహకరిస్తుందని బోధించారు. ‘అపారమైన విశ్వాసం, అనంతమైన శక్తి.. ఇవే మీ విజయసాధనకు మార్గాలు’ అని వివేకానందుడు చెప్పారు. ఎవరిపైనో భారం వేయకుండా మన శక్తియుక్తులను నమ్ముకోవడమే విజయతీరానికి మార్గం అని నేటి యువత, విద్యార్థులు, క్రీడాకారులు, సైనికులు, ఉద్యోగులు అందరికీ ఆయన ఇచ్చిన సందేశంగా చెప్పవచ్చు. అందుకే ఆయన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి. దేశం కోసం… తన దేశ యువతను మేల్కొలపాలనే లక్ష్యంతో అనేక ప్రేరణాత్మక ప్రసంగాలు ఆయన ఇచ్చారు. ఇలా ఓ కొవ్వొత్తిలా తాను కరిగిపోతూ… దేశం కోసం కృషి చేశారు కాబట్టే ఆయన యూత్ ఐకాన్ అయ్యారు.

హైదరాబాద్‌తో ఆయన బంధం…
దేశానికి యువతే పట్టుకొమ్మలని, వారు సంకల్ప బలంతో ఏదైనా సాధించగలరని స్వామి వివేకానంద ఎన్నో ప్రసంగాలు చేశారు. కానీ ఆయనకు అరుదైన అవకాశాన్ని ఇచ్చింది హైదరాబాద్ మహానగరం. వివేకానంద పేరు చెప్పగానే అందరికీ గుర్తుకొచ్చేది చికాగో సర్వమత సమ్మేళనంలో ఆయన చేసిన ప్రసంగం. కానీ అంతకుముందే సికింద్రాబాద్‌ మెహబూబియా కళాశాల వేదికగా 1893, ఫిబ్రవరి 13న ప్రసంగమే ఆయన తొలి ప్రసంగంగా చరిత్రలో నిలిచిపోయింది. ‘మై మిషన్‌ టు ది వెస్ట్‌’ అని చికాగో సమ్మేళనానికి వెళ్లడానికి కారణాలను వివరించారు. ఇంగ్లీష్, హిందీ భాషలలో ఆయన ప్రసంగం చేయడంతో నిజాం సంస్థానం నుంచి హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు వందలాదిగా సమావేశానికి హాజరై ఉత్తేజితులయ్యారు. అప్పటి నిజాం రాజు ప్రధాని అయిన మహారాజా కిషన్ ప్రసాద్, ముస్లిం రాజులు అమెరికా, చికాగో పర్యటనకయ్యే మొత్తం ఖర్చులను భరిస్తామని ముందుకురాగా వివేకానంద దాన్ని సున్నింతగా తిరస్కరించారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌లోని మక్కా మసీదు, చార్మినార్, ఫలక్‌నుమ ప్యాలెస్, గోల్కోండ కోట, హిందూ ఆలయాలను దర్శించుకున్నారు.