News

సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

1.1kviews

నెల్లూరు జిల్లా గూడూరులో సామాజిక సమరసతా వేదిక అధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్నడాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మొదటగా నగర వీధులలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అనేక మంది విద్యార్ధులు, వివిధ సంస్థలకు చెందిన సామాజిక కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.

సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోడూరు సత్యం మాట్లాడుతూ సాంఘిక దురాచారాలకు లొంగక వాటిని ఎదిరిస్తూ ఆజన్మాంతం పోరు సల్పిన యోధుడు అంబేద్కర్ అని కొనియాడారు. భారతదేశంలో పీడితులు, ఉపేక్షితులు సగర్వంగా తలెత్తుకు తిరగాలి, అంతరాలు, అపోహలు తొలగి సమతా మమతలు వెల్లివిరియాలన్నదే ఆయన ఆకాంక్ష, జీవిత లక్ష్యం అని తెలిపారు. అంబేద్కర్ త్యాగమయ, కర్మమయ, తపోమయ జీవనుడని తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ అంబేద్కర్ సేవలను గుర్తు చేసుకున్నారు.

అనంతరం ముఖ్య అతిధి శ్రీ కోడూరు సత్యం, ప్రముఖ సామాజిక కార్యకర్త మండ్ల రాజేష్ కుమార్, ABVP నాయకులు మల్లిఖార్జున, మనోజ్ తదితరులు నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి నివాళులర్పించారు.

నెల్లూరు జయభారత్ హాస్పిటల్లో రక్త దాన శిబిరం …

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 128వ జయంతి ఉత్సవాల సందర్భంగా నెల్లూరులోని జయభారత్ హాస్పిటల్ అధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆరెస్సెస్ జిల్లా కార్యదర్శి శ్రీ విశ్వేశ్వర రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ వాణి, బాణి, నాయకత్వ లక్షణం, సంఘటనా దక్షత అందరినీ కలుపుకుంటూ ముందుకు పోవడంలో ఆయన చూపిన ప్రతిభ విలక్షణమైనవి, విశేషమైనవని అన్నారు. అంబేద్కర్ నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఆత్మవిశ్వాసంతో సుదీర్ఘ పోరాటం సాగించిన యోధుడని శ్రీ విశ్వేశ్వర రావు కొనియాడారు. ఆయన పడుతున్న పాట్లు, మనసులోని వేదన ఆయన రచనలలో ప్రసంగాలలో, రచనలలో వ్యక్తమయ్యేవన్నారు. ఆనాటి సామాజిక పరిస్థితులలో తీవ్రమైన కుల వివక్షను, అవమానాలను సహిస్తూనే ఆయన ఉన్నత విద్యను అభ్యసించి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారని, యావద్దేశానికి మార్గదర్శి అయిన రాజ్యాంగానికి రూపకర్త అయినారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జయభారత్ హాస్పిటల్ ప్రధాన కార్యదర్శి శ్రీ హరికుమార్ రెడ్డి, డాక్టర్ సి.వి. సుబ్రహ్మణ్యం, శ్రీ గుర్రం సుధాకర్, హాస్పిటల్ మేనేజర్ శ్రీ గురుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

విశ్వహిందూ పరిషత్ అధ్వర్యంలో దుస్తుల పంపిణీ :

ఈ కార్యక్రమంలో చివరిగా విశ్వహిందూ పరిషత్ వారు బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు శ్రీ మెంటా రామ్మోహన్, సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కోడూరు సత్యం పాల్గొన్నారు.