సరిహద్దు, గిరిజన ప్రాంత ప్రజలకు ఉచితంగా డీడీ సెట్‌టాప్ బాక్సులు.. గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కూ ఆమోదం!

సరిహద్దు, గిరిజన ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు 8 లక్షల కుటుంబాలకు డీడీ సెట్-టాప్ బాక్స్‌ను ఉచితంగా ప్రభుత్వం అందించనుంది. దీనికోసం అవసరమైన రూ.2539 కోట్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బిండ్) పథకం ద్వారా వారికి సెట్‌టాప్ బాక్సులు అందించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. దీంతో దేశంలో ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ కార్యక్రమాలు మరింత మందికి చేరువకానున్నాయి. దీంతోపాటు మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
80 శాతం మందికి సేవలు అందేలా..
బిండ్ అనేది ప్రసార భారతి, ఆల్ ఇండియా రేడియో, డీడీకి చేయాతనందించే పథకం. దీంతో పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ పరిధిని పెంచి, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలవుతుంది. ఈ పథకం దేశంలోని 80 శాతం మందికి ఆల్ ఇండియా రేడియో సేవలు అందేలా చేస్తోంది.
గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం..
జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. జాతీయ హైడ్రోజన్ మిషన్‌కు రూ. 19,744 కోట్ల కేటాయించాలని నిర్ణయం తీసుకుంది. రూ.1,466 కోట్లతో పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించిన కేంద్రం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించాలని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంగా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ద్వారా 6 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేస్తోంది.





