News

జిన్‌పింగ్‌ గద్దె దిగు అంటూ చైనాలో కరోనా ఆంక్షలపై ఆగ్రవేశాలు

260views

బీజీంగ్‌: కరోనా ఆంక్షలపై చైనా వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జీరో కరోనా పాలసీని అమలు చేస్తున్న అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. జనం పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వారిని అదుపు చేయలేక చెదరగొట్టడం కోసం పలుచోట్ల పెప్పర్ స్ప్రే ఉపయోగించారు.

దాంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ‘జిన్ పింగ్ స్టెప్‌ డౌన్.. కమ్యూనిస్ట్ పార్టీ స్టెప్ డౌన్’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. ఈ ఆందోళనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గత గురువారం వాయవ్య చైనాలోని షింజియాంగ్ ప్రాంతంలోగల ఉరుమ్‌కీలో ఓ రెసిడెన్షియల్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి పదిమంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆంక్షలు కఠినంగా అమలు చేయడంవల్ల లోపల ఉన్నవారు బయటకు రాలేక, శ్వాస తీసుకోలేక 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పటికే లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న ప్రజల ఆగ్రహానికి ఈ ఘటన ఆజ్యం పోసింది.

కరోనా ఆంక్షల కారణంగానే ఇటీవల అగ్ని ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని, మంటలను అదుపు చేయడంలో సహాయక సిబ్బందికి అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యాయని, అందువల్ల మంటలు తగ్గుముఖం పట్టడానికి మూడు గంటల సమయం పట్టిందని ఆందోళనకారులు ఆరోపించారు. ఇళ్లకు గొలుసులతో తాళాలు వేయడం వల్ల లోపలున్న వారికి తప్పించుకునే మార్గం లేకుండా పోయిందని ఆవేదన వారు వ్యక్తం చేశారు.

అయితే, నిరసనకారులు చేస్తున్న ఆరోపణలను అధికారులు కొట్టిపడేశారు. ప్రమాదం జరిగిన భవనం వద్ద ఎలాంటి ఆంక్షలు అమలులో లేవని చెప్పారు. కానీ, అగ్నిప్రమాదం జరిగిన షింజియాంగ్‌ ప్రాంతంలో గత 110 రోజులుగా కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉన్నది. దాదాపు 10 మిలియన్ల మంది ఉయిఘర్లు ఇక్కడ నివసిస్తున్నారు. ఆంక్షల కారణంగా ఉరుమ్‌కీలోని 40 లక్షల మంది దాదాపు నాలుగు నెలలుగా ఇండ్లకే పరిమితమయ్యారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి