ముంబై: ‘‘ద కశ్మీర్ ఫైల్స్” సినిమాలోని ఒక్క సన్నివేశమైనా.. ఒక్క డైలాగ్ అయినా అబద్ధం అని ఎవరైనా నిరూపిస్తే.. నేను సినీరంగం నుంచి తప్పుకుంటా. ఇంకెప్పుడూ సినిమాలు తీయను’’ అని బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఉద్వేగంగా సవాల్ చేశారు. ఇజ్రాయెల్ దర్శకుడు నడవ్ లాపిడ్ గానీ.. దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్న తుక్డేగ్యాంగ్, అర్బన్ నక్సల్స్ లేదా ఉగ్రవాదులు కశ్మీర్ ఫైల్స్ అబద్ధమని నిరూపించాలని సవాల్ విసిరారు.
గోవాలో జరిగిన అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సవం(ఇఫీ)లో ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రాన్ని ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంపై ఇజ్రాయెల్ దర్శకుడు, ఇఫీ జ్యూరీ హెడ్ నడవ్ లాపిడ్ ముగింపు వేడుకల్లో విమర్శలు చేశారు. ‘‘ఈ సినిమాను వీక్షించి దిగ్ర్భాంతి చెందా. ఇది ప్రచారం కోసం తీసిన అసభ్యకర చిత్రం. ఇలాంటి ప్రతిష్ఠాత్మక సినీ మహోత్సవంలో ప్రదర్శించేందుకు ఈ సినిమా తగదు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారి తీశాయి. ఈ చిత్ర దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి లాపిడ్ వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ మంగళవారం ట్విటర్‌లో ఓ వీడియో విడుదల చేశారు. ఇజ్రాయెల్ దర్శకుడి వ్యాఖ్యలపై తాను వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు.
‘‘నిజం అనేది చాలా ప్రమాదకరమైనది. నిజం అనేది ప్రజలను అబద్ధాలు చెప్పేలా చేస్తుంది. కశ్మీర్ ఫైల్స్ ముమ్మాటికీ నిజం. కల్పితం కాదు. కశ్మీరీ పండిట్లపై జరిగిన అత్యాచారాలు, ఊచకోతలు.. వారిని బలవంతంగా కశ్మీర్ వీడేలా పన్నిన పన్నాగం అంతా నిజం. అలా కశ్మీర్‌ను వీడిన 700 మంది బాధితులతో మాట్లాడాకే.. ఈ చిత్ర కథను రూపొందించా. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం.. ప్రతి డైలాగ్ నిజం నుంచి వచ్చినవే’’ అని ఆయన ఆ వీడియోలో తేల్చి చెప్పారు.
Source: Nijamtoday