News

భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్టు అధ్యక్షుడు

462views

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు అరబ్‌ రిపబ్లిక్‌ దేశమైన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాహ్ అల్‌ సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన రిపబ్లిక్‌ డే ఉత్సవాలకు హాజరవుతున్నారని భారత విదేశాంగ శాఖ ఆదివారం ప్రకటించింది.

ప్రధాని నరేంద్ర మోడీ లాంఛనప్రాయ ఆహ్వానాన్ని విదేశాంగ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ అక్టోబర్ 16ననే అందజేశారు. భారత రిపబ్లిక్‌ డే వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఇదే తొలిసారి. భారత్‌-ఈజిప్టు దేశాల మధ్య గత ఏడున్నర దశాబ్దాలుగా స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయి.

ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 75 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఇటీవల రెండు దేశాలు 75వ వార్షికోత్సవాలు కూడా జరుపుకొన్నాయి. రెండు దేశాలు 1950 నుంచే గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాయి. కాగా, ప్రతి ఏడాది భారత గణతంత్ర వేడుకలకు విదేశీ అధ్యక్షుడు ముఖ్య అతిథిగా హాజరు కావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. అయితే, కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021 సంవత్సరాల్లో ఎవరూ ముఖ్య అతిథులుగా హాజరు కాలేదు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వస్తున్నారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి