News

ఆంధ్రప్రదేశ్‌లో మతం మారాలంటూ విద్యుత్​ అధికారి ఒత్తిడి.. స్పందనలో బాధితుల ఫిర్యాదు

420views

విజయనగరం: మతం మారాలంటూ విద్యుత్తుశాఖకు చెందిన అధికారి తమపై ఒత్తిడి తెస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాకు చెందిన ఆరుగురు వ్యక్తులు స్పందనలో ఫిర్యాదు చేశారు. బాడంగి మండలం ఎరుకులపాకల గ్రామానికి చెందిన ఎంపీటీసీ పాలవలస గౌరు, వారి కుటుంబ సభ్యులతో కలిసి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

గ్రామంలో కొందరికి 2020లో అధిక మొత్తంలో కరెంటు బిల్లు వచ్చిందని, మీటర్లలో సాంకేతిక తప్పిదాల కారణంగా అధిక మొత్తం బిల్లులు వచ్చాయని.. అప్పట్లో విద్యుత్తుశాఖ అధికారులు మీటర్లు మార్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే.. అప్పటి బకాయిలు చెల్లించాలని విద్యుత్తుశాఖ జేఏఓ(జూనియర్ అకౌంట్ ఆఫీసర్) జయరాజ్ తమపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారని.. బకాయిల బిల్లులు చెల్లించకపోవటంతో తమ ఇళ్ళకు విద్యుత్తు సరఫరా కూడా నిలిపివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

బకాయిలు చెల్లించాలని.. లేకపోతే మతం మారాలని ఆ అధికారి తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు మండలస్థాయి అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవటంతో.. ఎస్పీ కార్యాలయంలో నిర్వహిస్తున్న స్పందనలో ఫిర్యాదు చేశామన్నారు. ఎస్టీ కులానికి చెందిన తమను.. జేఏఓ జయరాజ్ బకాయిల పేరుతో వేధిస్తున్నారని.. ఇళ్ళకు కరెంట్ తీసివేయటంతో రెండు నెలలుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన విచారణ జరిపి.. తమకు న్యాయం చేయాలని ఫిర్యాదుదారులు ఎస్పీ దీపికకు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశారు.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి