
కశ్మీర్: సుందర కశ్మీరాన్ని భద్రంగా కాపాడడమే కాదు.. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఆ ప్రాంత ప్రజల్లో పరివర్తన తెచ్చేందుకు సైన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. చొరబాట్లు ఆపడం, ఉగ్రవాదులను కట్టడి చేయడం, యువత ఉగ్రవాదంవైపు మళ్లకుండా చూడడం వంటి బహుముఖ వ్యూహాలను అనుసరిస్తోంది. ప్రజల అభ్యున్నతికి తోడ్పడేలా సైన్యం పలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
వీటిలో సహీ రాస్తా (సరైన దారి), సూపర్-50 వంటి పథకాలు ప్రధానమైనవి. కశ్మీరు యువత ఉగ్రవాదం వైపు వెళ్లకుండా చేసే కృషిలో భాగంగా.. సైన్యం ‘సహీ రాస్తా’ పథకం కింద అతివాద భావజాలం ఉన్న యువతను గుర్తిస్తోంది. ఉగ్రవాదం వల్ల కలిగే అనర్థాలను విడమరిచి చెప్పి వారిని పునరావాస శిబిరాలకు తరలిస్తోంది. 25 మంది యువకులతో ఒక్కో బృందాన్ని ఏర్పాటు చేసి 21 రోజులపాటు శిక్షణ ఇస్తోంది. వాస్తవ పరిస్థితులు, ఉగ్రవాద ముఠాలు చేస్తున్న ప్రచారాన్ని వివరంగా చెప్పడంతో పాటు వారంతా సొంతకాళ్లపై నిలబడేలా ప్రోత్సహిస్తోంది. ముఖ్యంగా మతగ్రంథాల్లోని మంచి విషయాలను ఉగ్రవాదులు ఎలా వక్రీకరిస్తున్నారో మతపెద్దలతోనే చెప్పిస్తున్నారు. ఈ శిబిరాలకు హాజరైన 87 శాతం మందిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని సహీ రాస్తా పథకానికి నేతృత్వం వహిస్తున్న కమాండర్ అలోక్‌దాస్ తెలిపారు.