వారణాసి: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంతంలో ఉన్న ‘శివలింగం’కు ఇస్తున్న రక్షణను పొడిగిస్తూ శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ శివలింగానికి రక్షణ కల్పించాలని స్పష్టం చేసింది.
జ్ఞానవాపి-కాశీ విశ్వనాథ్ కేసు వినేందుకు ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ మేరకు మే 17న ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ సంఘాలు దాఖలు చేసిన పిటిషన్‌పై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది మే 17న ఇచ్చిన ఉత్తర్వులకు రేపటితో (నవంబర్ 12) గడువు ముగియనున్న దృష్ట్యా హిందూ సంఘాలు మరోసారి కోర్టుని ఆశ్రయించాయి.
శివలింగానికి సుప్రీంకోర్టు కల్పించిన రక్షణ ఈనెల 12వ తేదీతో ముగుస్తున్నందున, భద్రతను పొడగించాలని హిందూ భక్తుల తరఫున హాజరైన అడ్వకేట్ విష్ణు శంకర్ కోర్టు దృష్టికి తెచ్చారు. వీడియోగ్రఫీ సర్వేలో కనుగొన్న శివలింగం ఉంటున్న ప్రాంతానికి రక్షణ కల్పించాలని గత మే 17న వారణాసి జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ సుప్రీంకోర్టు తాత్కాలిక ఆదేశాలిచ్చింది.
Source: Nijmtoday