
విజయవాడ: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం ఎనిమిది గంటల 30 నిమిషాల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నారు. మధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల 27 నిమిషాల వరకూ చంద్రగ్రహణం నేపథ్యంలో అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. గ్రహణం తర్వాత సంప్రోక్షణతో ఆలయాన్ని శుద్ధి చేసి భక్తులను సర్వ దర్శనానికి అనుమతించనున్నారు. రాత్రికి జరగాల్సిన గరుడ సేవను కూడా రద్దు చేసింది. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలంలో ఆలయ ద్వారాలను ఉదయం 6.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయనున్నట్టు ఆలయ అధికారులు తెలిపారు. బెజవాడ దుర్గమ్మ, మహనంది ఆలయాల్ని ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు మూసివేయనున్నట్టు వేదపండితులు తెలిపారు.
కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఈరోజు ఉదయం ఎనిమిది గంటలు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మూసివేయనున్నారు. చంద్రగ్రహణం కారణంగా అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. పుణ్యా వచనం, ఆలయ శుద్ధి అనంతరం గోపూజ, స్వామికి అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు చేసి.. తిరిగి బుధవారంఉదయం ఎనిమిది గంటల నుంచి సర్వదర్శనం. ప్రారంభించనున్నట్టు తెలిపారు.
రాహుగ్రస్తొదయ చంద్రగ్రహణం కారణంగా ప్రముఖ శైవ క్షేత్రం మహానంది ఆలయాన్ని మూసివేశారు. ఉదయం ఏడు గంటలకు మూసివేసిన ఆలయాన్ని తిరిగి గ్రహణానంతరం రాత్రి ఏడున్నర గంటలకు తెరువనున్నారు. ఆలయ మూసివేత కార్యక్రమంలో వేదపండితులు, ఆలయ చైర్మన్ మహేశ్వర రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.





