
-
‘సమరసత’ సమ్మేళనంలో కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ స్వామి
విజయవాడ: భారతావనికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్ళ నిండిన సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవాల వేళ దళితులకు ఏం మేలు జరిగింది? ఇంకా వారి సంక్షేమానికి ఏం చేయాలి అన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ స్వామి అన్నారు. నేడూ దళితులపై వివిధ రకాల వివక్ష ఉందన్న వేదనతో మనమంతా ‘సమరసత’ సమావేశాలు జరుపుకొంటున్నామంటే, ఇంకా దేశంలో ఆయా వర్గాలను ఉద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీలోని విజయవాడలోని సిద్దార్థ కళాశాల ఆడిటోరియంలో ఆదిఆంధ్ర సమ్మేళనం.. 105 సం.రాల సందర్భంగా సమరసత సమ్మేళనం ఆదివారం ఉదయం సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నారాయణ స్వామి హాజరై, మాట్లాడారు. ఒక్క దళితులే కాదు… అణగారిన వర్గాలు అభివృద్ధి చెందాలంటే, సమాజంలోని సమూల మార్పులు రావాలని ఆకాంక్షించారు. రాజకీయ నేత నుంచి సామాన్యుడి వరకూ ప్రతి ఒక్కరూ ఒక సామాజిక కార్యకర్తగా తయారై, అణగారిన వర్గాల అభ్యున్నతికి తమ వంతు కృషి సల్పాలని కోరారు. నా పార్టీ నన్ను మంత్రిని చేసి, సామాజిక న్యాయం పాటించిందని, ఇదొక ముందడుగని అన్నారు.
దేశంలోని అనేక రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు అణగారిన వర్గాలను ఏమైనా ఉద్ధరించాయా? లేదా? అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నారాయణ స్వామి అన్నారు. దళితులు, అంటరానివారు వంటి పేర్లతో సమాజంలో ఉన్న వర్గాలను ఎప్పుడు మనమంతా సహృదయంతో అక్కున చేర్చుకుంటామో అప్పుడే మనమంతా భగవంతుని దృష్టిలో సామాజిక సంపన్నులమన్నారు. కుక్కకు ముద్దిస్తాము.. కానీ, దళితుని ముట్టుకోము… దేవాలయంలోకి ప్రవేశం లేదంటాము… ఇటువంటి చర్యలు దేశాభివృద్ధి గొడ్డలిపెట్టని అన్నారు.
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి నిరంతరం కృషి: విష్ణు
సమాజంలో వివక్ష ఎదుర్కొంటున్న ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ఏడేళ్ళ కిందట ఆవిర్భావించిన సామాజిక సమరసత వేదిక నిరంతరం కృషి చేస్తోందని ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వహించిన సామాజిక సమరసత వేదిక రాష్ట్ర అధ్యక్షుడు టి. విష్ణు అన్నారు. కృష్ణానదీ తీరాన అనేక సామాజిక, ధార్మిక, సాంస్కృతిక, సాహిత్య, రాజకీయ ఉద్యమాలు జరిగాయని, 105 ఏళ్ళ కిందటే వివిధ కులాలకు చెందిన పెద్దలు వందల ఏళ్ళుగా అంటరానితనానికి గురైన వర్గాల ఉన్నతి కోసం, సామాజిక సమరసత కోసం 1917, నవంబర్ 4,5,6తేదీల్లో విజయవాడలో ‘ఆది ఆంధ్ర మహా సభ’ను నిర్వహించారన్నారు. ఈ చారిత్రిక ఘట్టాన్ని స్మరించుకుని, అన్ని కులాలను సద్భావన వైపు, సమ సమాజం వైపు తీసుకువెళ్ళడం కోసం ఈ సమ్మేళనం నిర్వహిస్తున్నట్టు సభకు వివరించారు.
మత మార్పిడి వల్ల ఒరిగిందేమీ లేదు: ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్
మతం మార్చుకోవడం వల్ల ఎవరికీ ఒరిగిందేమీ లేదని, వాళ్ళ స్టేటస్ కూడా పెరగదని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. సమరసత సమ్మేళనంలో పాల్గొని, మాట్లాడారు. గాంధీజీ కూడా మతం మారొద్దన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నేడు కుల సమస్య ఆయా కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తోందని, సమాజం చైతన్యవంతమై ఈ సమస్యను నిర్మూలించాలన్నారు. నిజానికి కులం అనేది ఒక ‘సంస్కృతి’… ఈ విషయాన్ని విస్మరించడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ముఖ్యంగా దళితుల పట్ల ఉన్న చిన్నచూపును తొలగించేందుకు సామాజిక సమరసత వేదిక ఈ సమ్మేళం నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఇదొక చారిత్రక రోజన్నారు. అక్షరాస్యత, సామాజిక చైతన్యం రోజు రోజుకూ పెరుగుతున్న వేళ ఇంకా… కులం పేరిట జాడ్యాలు సిగ్గుచేట్టన్నారు. అగ్రవర్ణాలను ప్రశ్నించేముందు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కులాంతర వివాహాలు పెరగాలని అభిప్రాయపడ్డారు. భగవద్గీత వంటి అమూల్యమైన గ్రంథాలు పఠించడం వల్ల అన్ని సమస్యలు సమసిపోతాయన్నారు.
విశాల దృక్పథం అవసరం : మండలి బుద్ధ ప్రసాద్
కులాల పేరిట రేగుతున్న మంటలు ఆరిపోవాలంటే సమాజంలోని ప్రతి ఒక్కరిలో విశాల దృక్పథం అవసరమని, ప్రతి వ్యక్తీ తనవాడేనన్న భావన అందరిలో ఉండాలని శాసనసభ మాజీ ఉప సభావతి మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సమరసత సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. సమాజానికి దూరంగా ఉన్న వారిని కలుపుకొవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కొన్ని ఏళ్ళ కిందట సమాజం దూరంపెట్టిన దళితులను కాశీనాథుని నాగేశ్వరరావు, వేముల కూర్మయ్య వంటి మహానుభావులు అక్కున చేర్చుకున్నారన్నారు. ఇదే గడ్డపై సుమారు 800 హాస్టళ్ళు స్థాపించి, దళిత విద్యార్థులు ఉన్నత విద్యలు అభ్యసించేలా పాటుపడ్డారన్నారు.
రాజకీయం.. హైందవం కావాలి: ఐవైఆర్ కృష్ణారావు
దళితులపట్ల, ఇతర అణగారిన వర్గాల పట్ల అణిచివేత ధోరణి పోవాలంటే రాజకీయం… హైందవం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. సమరసత సమ్మేళనంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ దళితుడని పక్కన పెడితే యావత్తు హైందవానికే హాని జరుగుతుందన్నారు. హిందువుల పూజలు, పండగల్లో తప్పక దళితుడిన పాత్ర ఉంటుందని, దళితుడిని అవమానిస్తే నిన్ను నీవు అవమానించుకున్నట్టేనని హెచ్చరించారు. సామాజిక సమరసత సాధించడం, కులాల పట్ల నిర్లక్ష్యవైఖరి రూపుమాపడం వంటి సమస్యలు కేవలం హైందవంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా దేవాలయాల పూజారులు ఒక బలమైన సామాజిక కార్యకర్తగా తయారుకాల్సిన అవశ్యకత ఉందన్నారు. ఆలయాల్లోని తీర్థ, ప్రసాదాలను ఆయా ప్రాంతాలను సందర్శంచి, పంపిణీ చేస్తే దేవం పట్ల, దేశం పట్ల భక్తి ఏర్పడుతుందని తెలిపారు. అయితే, పూజారులకు శిక్షణా తరగతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
అన్ని చోట్లా పారిశుద్ధ్య కార్మికులు గౌరవింపబడుతున్నారా?: కోడూరు జయప్రద
దేశంలోని అన్ని చోట్ల దళితులు, పారిశుద్ధ్య కార్మికులు గౌరవింపబడుతున్నారా? అసమానతలు తొలగిన నాడు సుసంపన్నమైన సమాజం ఏర్పడినట్టని నెల్లూరు సామాజిక సమరసత రాష్ట్ర మహిళా కన్వీనర్ కోడూరు జయప్రద అన్నారు. కరోనా సమయంలో అందరూ ఇళ్ళల్లో తిష్ఠ వేస్తే, పారిశుద్ధ్య కార్మికులు అమూల్యమైన సేవలు అందించారని, నెల్లూరులో మాతృమూర్తుల ద్వారా ఘనంగా సత్కరించామని తెలిపారు. ఇలా అన్ని చోట్ల మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. సోదరి నివేదిత, సావిత్రాబాయి ఫూలే ప్రేరణతో కుల అసమానతలు రూపుమాపడంలో మహిళలు గొప్ప పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.
తప్పులను సంస్కరించుకుంటున్న హిందూ మతం: సునీల్ అంబేకర్
హిందూ మతం ఏళ్ళనాటి తప్పులను గుర్తించి, సంస్కరించుకుంటుందని, ఇది శుభపరిణామమని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ అన్నారు. భారతీయ గడ్డపై జన్మించిన ఎవరిని దూరం పెట్టడడం దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అందరూ మనవారేనన్న భావన సమాజంలోని చివరి వ్యక్తి వరకు వెళ్ళాలన్నారు. ఇప్పడు సంఘం చేస్తున్నది ఇదేనని అన్నారు. అయితే, సమాజం నుంచి ఇంకా మద్దతు అవసరముందన్నారు. ఒకనాడు గాంధీ, అంబేద్కర్ సంఘ్ శిబిరాలను సందర్శించారని, అక్కడ కుల ప్రస్తావన, వివక్ష లేకపోవడంతో ఆశ్చర్యపోయారన్నారు. అంతా భారతమాత బిడ్డల వలే కలిసిమెలిసి ఉండడం సంఘ్ నేర్పిన క్రమశిక్షణ అని తెలిపారు. ఇదే సామాజిక దురాచారాలను రూపుమాపడానికి ఏకైక మార్గమని పేర్కొన్నారు.
సమాజాన్ని అధ్యయనం చేయాలి: కమలానంద భారతి స్వామి
సమాజాన్ని చదవాలి… అధ్యయనం చేయాలి.. కాలికి బలపం కట్టుకుని వీధి, వాడా తిరగాలని అప్పుడే సమాజంలోని స్థితిగతులు అర్థమవుతాయని, అసమానతలను ఏ విధంగా నిర్మూలించాలకో అవగతమవుతుందని గన్నవరంలోని శ్రీ భువనేశ్వరి పీఠం పూజ్య శ్రీ కమలానందభారతి స్వామి అన్నారు. కుల సమస్యలు పోవాలంటే, ముందు మన ఇంట్లో స్థితిని గమనించి, మన ఇంటి నుంచే అటువంటి చర్యలకు పూనుకొవాలని పిలుపునిచ్చారు. నిజానికి కుల వ్యవస్థ గొప్పది. దీని వెనుక సైన్స్ ఉన్నది. కానీ, అసమానతలు ఈ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తున్నాయన్నారు. హిందువు అంటే.. ముందు దళితుడేనని ఈ సందర్భంగా అన్నారు. అయితే, ఇప్పుడిప్పుడే సమాజంలో మార్పులు వస్తున్నాయన్నారు. కుల వృత్తులను, కులాలను కించపరిస్తే దేశానికి అరిష్టమని హెచ్చరించారు. కాగా, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ముందుగా ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
పుస్తకాల ఆవిష్కరణ… ఘన సత్కారాలు
ఈ కార్యక్రమంలో మంగిపూడి వెంకటశర్మ కలం నుంచి జాలువారిన ‘నిరుద్ధ భారతం'(పద్య రూపం), ‘నిరుద్ధ భారతం'(పునర్ముద్రణ, వచన వ్యాఖ్యానం), రచయిత, జర్నలిస్ట్ డాక్టర్ దుగ్గరాజు శ్రీనివాసరావు రచించిన ‘కృష్ణానదీ తీరాన సమతా ఉద్యమాలు’ వంటి పుస్తకాలు ప్రముఖులు ఆవిష్కరించారు. అలాగే, పలువురిని సామాజిక సమరసత వేదిక, విజయవాడ తరుఫున ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సామాజిక సమరసత వేదిక కార్యకర్తలు, రచయితలు పాల్గొన్నారు.