
న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. బిట్‌కాయిన్ వంటి ప్రైవేట్ క్రిప్టో కరెన్సీలకు చట్టబద్ధ ప్రత్యామ్నాయమైన డిజిటల్ రూపాయి వచ్చేస్తోంది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) తొలి పైలట్ ప్రాజెక్టును ఈ రోజు (నవంబరు 1, మంగళవారం) ప్రారంభించనున్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ప్రకటించింది. సీబీడీసీని తొలుత టోకు లావాదేవీలకు మాత్రమే అందుబాటులోకి తెస్తున్నట్టు ఆర్‌బీఐ స్పష్టం చేసింది. రిటైల్ లావాదేవీల కోసం డిజిటల్ రూపీ తొలి పైలట్ ప్రాజెక్టును నెల రోజుల్లోపే ప్రారంభించనున్నట్టు ఆర్‌బీఐ తెలిపింది.
తొలి విడతగా, ఎంపిక చేసిన ప్రాంతాల్లోని కస్టమర్లు-మర్చంట్లతో కూడిన క్లోజ్డ్ యూజర్ గ్రూప్‌లకు మాత్రమే డిజిటల్ రూపాయి ద్వారా రిటైల్ లావాదేవీలు జరిపే అవకాశం కల్పించనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. డిజిటల్ రూపీ (హోల్‌సేల్) తొలి పైలట్ ప్రాజెక్టుగా సెకండరీ మార్కెట్లో ప్రభుత్వ సెక్యూరిటీ లావాదేవీల సెటిల్‌మెంట్ యూజ్ కేస్‌ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపింది.
ప్రభుత్వ సెక్యూరిటీల్లో లావాదేవీల కోసం డిజిటల్ రూపాయి జారీ చేసేందుకు ఎస్‌బీఐ సహా 9 బ్యాంక్‌లను ఎంపిక చేసినట్టు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్, యెస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, హెచ్‌ఎ్‌సబీసీ కూడా ఈ జాబితాలో ఉన్నాయి.
Source: Nijamtoday





