
వాషింగ్టన్: దీపాల పర్వదినం దీపావళిని సరిహద్దును దాటి అనేక దేశాల్లో ప్రజలు జరుపుకొన్నారు. ఈ పండుగను భారతీయ మూలాలు ఉన్నా భారతీయులే కాకుండా భారతీయతతో సంబంధం లేని వారు కూడా నిర్వహించుకోవడం విశేషం. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అన్ని తరగతుల మధ్య దీపావళి ప్రసిద్ధి చెందింది. రాజకీయ నాయకులు సహితం ఈ సంబరాలు జరుపుకోవడంలో వెనుకబడటం లేదు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ప్రథమ మహిళ డాక్టర్ జిల్ బిడెన్ సోమవారం వైట్ హౌస్‌లో రంగరంగ వైభవంగా దీపావళి సంబరాలు జరుపుకొన్నారు.
“ఈ పర్వదినాన మీకు ఆతిథ్యం ఇవ్వడం మాకు గర్వకారణం. వైట్‌హౌస్‌లో ఈ స్థాయిలో దీపావళి రిసెప్షన్ నిర్వహించడం ఇదే తొలిసారి. చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా ఆసియా అమెరికన్లు మాకు అండగా ఉన్నారు. దీపావళి వేడుకను అమెరికా సంస్కృతిలో సంతోషకరమైన భాగంగా చేసినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము,” అంటూ బిడెన్ స్వాగతం పలికారు.
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా దీపావళిని మెరుస్తున్న ‘ఫుల్జాదీ’ పట్టుకుని, ఈ కార్యక్రమంలో భారతీయ సంతతి వ్యక్తులతో తన ఆనందాన్ని పంచుకోవడం విశేషం. ఈస్ట్ రూమ్‌లో జరిగిన రిసెప్షన్‌కు 200 మందికి పైగా ప్రముఖ భారతీయ అమెరికన్లు హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది హిందువులు, జైనులు, సిక్కులు, బౌద్ధులకు, ఇతర దేశాల వారు దీపావళి జరుపుకొన్నారు.
Source: Njamtoday





