
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బాణసంచా కొనుగోలు, కాల్చడంపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను అత్యవసరమైనది భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ పిటిషన్ పైనా, ఢిల్లీలో బాణసంచా నిషేధంపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌పై ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. ఇప్పటికైనా ప్రజలు కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనీయండి అంటూ పిటిషనర్లను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. బాణసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఢిల్లీ పరిధిలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా కూడా రూ.200 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా 6 నెలల పాటు జైలు శిక్ష కూడా పడే అవకాశాలున్నాయి. ఢిల్లీలో పటాకులు కొని, పేల్చితే 200 జరిమానానే కాకుండా.. ఆరు నెలల జైలు శిక్ష తప్పదని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. ఢిల్లీలో బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు చేస్తూ పట్టుబడిన వారికి మూడేళ్ళ జైలు శిక్ష విధిస్తున్నట్టు గోపాల్ రాయ్ ప్రకటించారు. పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ 9B కింద వారికి 5,000 రూపాయలు జరిమానా కూడా పడుతుంది.
Source: NationalistHub





