భాగ్యనగరం: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆస్తులను జప్తు చేస్తున్నట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రకటించింది. ఎంపీ నామాకు చెందిన రూ.80.65 కోట్లు విలువైన స్థిర, చర ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఈడీ ప్రకటించింది.
రాంచి ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణంలో అవకతవకలు చోటు చేసుకున్నట్టుగా నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఎంపీ ఆస్తులను జప్తు చేస్తున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. ఇప్పటికే ఈ కేసులో రూ.73.74 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్టుగా ఈడీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు కింద బ్యాంకు రుణాలుగా తీసుకున్న రూ.361.29 కోట్లను దారి మళ్ళించినట్టుగా ఈడీ కేసు నమోదు చేసింది.
నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) 2011లో రాంచీ-– రార్‌గావ్-– జంషెడ్‌పూర్ మధ్య ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి టెండర్స్ పిలిచింది. 114 కి.మీ నుంచి 277.50 కి.మీ (సుమారు 163.50 కి.మీ) వరకు ఎన్‌హెచ్-33లో 4 -లేనింగ్ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసింది. ఈ ప్రాజెక్ట్‌ను నామా నాగేశ్వర్‌రావుకు చెందిన మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ దక్కించుకుంది.
‘రాంచీ ఎక్స్‌ప్రెస్ వేస్ లిమిటెడ్’ పేరుతో ఫర్మ్ ను రిజిస్టర్ చేసింది. ప్రాజెక్ట్ పూర్తి కాకపోవడంతో ఎన్‌హెచ్‌ఏఐ, కెనరా బ్యాంక్ యాజమాన్యం 2019 మార్చి 12న సీబీఐకి ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు ఫోరెన్సిక్ ఆడిటర్లు, ఇంజనీర్లు, సబ్-కాంట్రాక్టర్లు, మధుకాన్ గ్రూప్ ప్రమోటర్ల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు. 2020 డిసెంబర్‌లో చార్జ్‌షీట్ ఫైల్ చేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా గతేడాది ఈడీ కేసు రిజిస్టర్ చేసింది.
నిరుడు జూన్‌లో హైదరాబాద్‌లోని నామా నాగేశ్వరరావు ఇంటితో పాటు డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇండ్లు ఆఫీస్‌ల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నామా నాగేశ్వరరావు ఇంటి నుంచి లెక్కల్లో లేని రూ. 34 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ అకౌంట్స్ సీజ్ చేశారు.
హైదరాబాద్, పశ్చిమ బెంగాల్‌తోపాటు విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాలో రూ. 88.85 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు, రూ.7.36 కోట్ల విలువ చేసే చరాస్తులను ఈడీ జప్తు చేసింది. రాంచీ ఎక్స్ ప్రెస్‌వేస్ లిమిటెడ్ పేరుతో కెనరా బ్యాంకు నుంచి సుమారు రూ. 1,030 కోట్ల రుణాలు మధుకాన్ తీసుకుంది.
నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు. దీనికి తోడు అధిక ఖర్చులను తప్పుగా క్లెయిమ్ చేయడానికి ప్లాన్ చేసింది.షెల్ కంపెనీలు ఉషా ప్రాజెక్ట్స్, బీఆర్ విజన్స్, శ్రీ ధర్మ శాస్తా కన్‌స్ట్రక్షన్స్, నాగేంద్ర కన్‌స్ట్రక్షన్స్, రాగిణి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మి కన్‌స్ట్రక్షన్స్ ద్వారా రూ. 75.50 కోట్లు క్యాష్ విత్‌డ్రా చేశారు.
ఈ ఆరు షెల్ కంపెనీలు నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య నిర్వహిస్తున్నారు. మధుకాన్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి రూ. 361.29 కోట్లు డైవర్ట్ అయ్యాయి. ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ హైవే ప్రాజెక్ట్ పూర్తి చేయకపోవడంతో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్‌ను చెల్లించలేదు.
Source: Nijamtoday