News

తైవాన్‌ విషయంలో బలప్రయోగానికీ వెనుకాడం : జిన్‌పింగ్‌ హెచ్చరిక

340views

బీజింగ్‌: హాంకాంగ్‌పై స్పష్టమైన ఆధిపత్యం సాధించామని.. దాంతో ఆ ప్రాంతాన్ని ‘ఆందోళనల’ నుంచి ‘పరిపాలన’ వైపు మార్చామని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ ఉద్ఘాటించారు.

తైవాన్‌ విషయంలో అమెరికా తీరుపై మండిపడ్డ ఆయన.. చైనా  భూభాగంతో ఏకం చేయడానికి బలప్రయోగానికీ వెనుకాడమని హెచ్చరించారు. చైనా కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) 20వ జాతీయ మహాసభల్లో ప్రారంభ ఉపన్యాసం చేసిన జిన్‌పింగ్‌.. గత పదేళ్లలో దేశంలో చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని వివరించారు.

‘తైవాన్‌ సార్వభౌమాధికార దేశమని తనకు తానే భావిస్తోంది. కానీ, దాన్ని చైనా మాత్రం విడిపోయిన ప్రావిన్సుగానే చూస్తోంది. పునరేకీకరణ కోసం చిత్తశుద్ధితో శాంతియుతంగా ప్రయత్నిస్తాం. అయినప్పటికీ తైవాన్‌ ఏకీకరణకు బలప్రయోగ అస్త్రాన్నీ విడిచిపెట్టలేము. వేర్పాటువాద శక్తులను అడ్డుకునేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటాం’ అని షి జిన్‌పింగ్‌ స్పష్టం చేశారు. మూడోసారి పార్టీ, అధ్యక్ష పగ్గాలు చేపడుతోన్న సందర్భంగా ఇటువంటి హెచ్చరికలు చేసిన ఆయన.. దేశ సార్వభౌమాధికారం, భద్రత, అభివృద్ధి ప్రయోజనాలను కాపాడుకునేందుకు సైన్యాన్ని ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతానని ఆశాభావం వ్యక్తం చేశారు.

వారం రోజుల పాటు కొనసాగనున్న చైనా కమ్యూనిస్టు పార్టీ మహాసభలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్‌ను వరుసగా మూడోసారి సీపీసీ ఎన్నుకోనుంది. జిన్‌పింగ్‌ మినహా ప్రధాన మంత్రి లీ కెకియాంగ్‌తో పాటు సీనియర్‌ నాయకులందరూ తమ పదవులకు రాజీనామాలు చేస్తారు. ఆ స్థానాల్లో కొత్తవారి నియామకాలు జరుగుతాయి. అయితే, అధ్యక్షుడిగా మూడోసారి జిన్‌పింగ్‌ బాధ్యతలు చేపడుతున్నప్పటికీ.. అది జీవితకాలం ఉండే అవకాశం ఉంది.

Source: Eenadu

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి