News

పాక్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికల అపహరణ!

365views

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌లో పక్షం రోజుల్లో నలుగురు హిందూ బాలికలు అపహరణకు గురవడంతో మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. హిందూ బాలికలకు రక్షణ లేని పరిస్థితి నెలకొంది. తాజాగా పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ హిందూ బాలికను దుండగులు అపహరించుకుపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఆమె జాడ తెలియడం లేదు.

హిందువులు, ఇతర మైనారిటీలు పాకిస్తాన్ జనాభాలో కేవలం 3.5 శాతం మంది మాత్రమే ఉన్నారు. ఈ మైనారిటీలంతా మెజారిటీ ముస్లింల చేతుల్లో మత హింసకు గురవుతున్నారు. బలవంతపు మతమార్పిడులను నిరోధించేందుకు ఉద్దేశించిన బిల్లును గత ఏడాది అక్టోబరులో పార్లమెంటరీ ప్యానెల్ తిరస్కరించింది.

పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్, హైదరాబాద్ పట్టణంలో ఇటీవల ఓ హిందూ బాలిక చంద్ర మహరాజ్‌ను కొందరు దుండగులు అపహరించారు. బాధితురాలి తల్లిదండ్రులు చెప్తున్నదాని ప్రకారం, చంద్రను ఫతే చౌక్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. ఆమె ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో ఈ దారుణం జరిగింది. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ, ఆమె జాడ ఇంకా తెలియడం లేదు. కొద్ది రోజుల క్రితం ముగ్గురు హిందూ మహిళలను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్టు వార్తలు వచ్చాయి. దీంతో మైనారిటీ హిందువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మిర్‌పుర్‌ఖాస్ పట్టణంలో హిందూ వ్యక్తి రవి కుర్మి మాట్లాడుతూ, తన భార్య రాఖీని ఇస్లామిక్ దుండగులు కిడ్నాప్ చేసి, ఇస్లాం మతంలోకి మార్చి, ఓ ముస్లిం యువకునితో ఆమెకు పెళ్ళి చేశారని చెప్పారు. అయితే, పోలీసులు మాత్రం రాఖీ తనంతట తానే మతం మారిందని, అహ్మద్ చందియోను పెళ్ళి చేసుకుందని చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో పాకిస్తాన్‌లో హిందువులపై అరాచకాలు, దురాగతాలు విపరీతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో కరీనా కుమారి అనే హిందూ బాలిక కోర్టులో మాట్లాడుతూ, తనను బలవంతంగా మతం మార్చి, ఓ ముస్లిం వ్యక్తితో పెళ్ళి చేశారని చెప్పింది. అంతకుముందు సత్రాన్, కవిత, అనిత అనే ముగ్గురు హిందూ బాలికలకు కూడా ఇటువంటి దుస్థితి ఎదురైంది.

మార్చి 21న పూజ కుమారి అనే హిందూ బాలికను దారుణంగా కాల్చి చంపేశారు. ఆమెను పెళ్ళి చేసుకుంటానని ఓ వ్యక్తి ఆమెకు చెప్పాడు. అందుకు ఆమె తిరస్కరించడంతో ఆమెను కాల్చి చంపేశారు. అప్పటి మత వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్ హక్ ఖాద్రి మాట్లాడుతూ, బలవంతపు మత మార్పిడుల నిరోధక చట్టం చేయడానికి ఇది అనుకూల సమయం కాదని పేర్కొన్నారు. ఇటువంటి చట్టాన్ని చేస్తే దేశంలో శాంతికి విఘాతం కలుగుతుందని తెలిపారు. మైనారిటీలు మరింత దెబ్బతింటారని చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి