
న్యూఢిల్లీ: క్రైస్తవం, ముస్లిం మతాల్లోకి మారిన దళితులకు ఎస్సీ హోదా కల్పించే అంశంపై అధ్యయనానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో కమిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విషయంలో అభిప్రాయం చెప్పాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ఈ మేరకు చర్య తీసుకుంది. కమిషన్‌లో సభ్యులుగా 1981వ బ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యూజీసీ సభ్యురాలు ప్రొఫెసర్ సుష్మా యాదవ్‌ను నియమిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది.
ఈ కమిషన్ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రెండేళ్ళలో నివేదిక సమర్పించాలని గడువు విధించింది. కమిషన్ దిల్లీ కేంద్రంగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. “ఇతర మతాల్లోకి మారినవారినీ ఎస్సీలుగా గుర్తించాలంటూ ఇటీవలి కాలంలో చాలా డిమాండ్లు వచ్చాయి. ఈ వాదనలను కొన్ని వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ సంక్లిష్టమైన అంశంపై సామాజిక, రాజ్యాంగపరమైన ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీనికున్న ప్రాధాన్యం, సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ హోదా కట్టబెట్టే అంశంలో మార్పులు చేర్పులు చేయాలంటే కమిషన్స్ ఆఫ్ ఎంక్వయిరీ యాక్ట్ 1952 కింద కచ్చితమైన అధ్యయనం చేయడంతోపాటు, విస్తృత సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఆ చట్టంలోని సెక్షన్ 3కింద ఉన్న అధికారాలను ఉపయోగించి ఇప్పుడు ‘కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీ’ని ఏర్పాటు చేస్తున్నాం” అని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారశాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది.





