
విజయవాడ: శరన్నవరాత్రులు, దసరా పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు నేటి నుంచి ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. అదనంగా 1072 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి అక్టోబర్ 10 వరకు రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాలు సహా ఇతర రాష్ట్రాలకూ బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్టు ఎన్టీఆర్ జిల్లా ఆర్టీసీ రీజినల్ మేనేజర్ యేసు దానం తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే వసూలు చేస్తారని.. ఎలాంటి అదనపు చార్జీలు ఉండవన్నారు.
విజయవాడ నుంచి హైదరాబాద్కు 338, రాజమహేంద్రవరానికి 283 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. విజయవాడ నుంచి విశాఖపట్నానికి 139, బెంగళూరుకు 10, చెన్నైకి 69 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలో చదువుతున్న విద్యార్థుల సౌకర్యార్థం రాయలసీమ, ఉత్తరాంధ్ర సహా అవసరమైన ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్ రిజర్వేషన్ సదుపాయం ఉందని.. ప్రయాణికులు ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని కోరారు.