
ముంబయి: బుర్ఖా వేసుకుని, ముస్లిం సంప్రదాయాలు పాటించడం లేదని ఇక్బాల్ అనే వ్యక్తి తన భార్య రూపాలీని నడిరోడ్డుపై దారుణంగా నరికి చంపాడు. ఆ మహిళ చేతులు, మెడపై కత్తితో పొడిచి కిరాతకంగా చంపాడు. ఈ ఘటన ముంబయిలోని చెంబూర్‌లో జరిగింది.
ఇక్బాల్ ట్యాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతనికి మొదట ఓ మహిళతో వివాహం జరిగింది. అయితే పిల్లలు పుట్టలేదన్న నెపంతో ఆమెను వదిలేసి రూపాలీ అనే మహిళను మూడేళ్ళ కిందట రెండో వివాహం చేసుకున్నాడు. రూపాలీ వేరే మతానికి చెందిన మహిళ కావడం వల్ల ఇక్బాల్ కుటుంబ సభ్యులు రూపాలీని వేధించడం మొదలుపెట్టారు.
ఆమెను ముస్లిం సంప్రదాయాలను పాటించమని ఇక్బాల్ కుటుంబ సభ్యులు ఒత్తిడి చేశారు. బుర్ఖా వేసుకోమని అడగగా రూపాలీ అందుకు నిరాకరించింది. దీంతో తరచూ ఇంట్లో వాగ్వాదం జరుగుతుండేది. ఒత్తిడి తట్టుకోలేని రూపాలీ తన కొడుకుని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చింది.
దాదార్‌లోని ఓ హాస్టల్లో తన స్నేహితురాలితో నివసిస్తోంది. భార్యాభర్తలిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటున్నప్పటికి ముస్లిం సంప్రదాయాలు పాటించే విషయమై ఇద్దరికి గొడవలు జరిగేవి. బాబు కస్టడీ విషయమై మాట్లాడాలని సోమవారం రూపాలీని బయటకు రమ్మని పిలిచాడు. బయటకి వచ్చిన రూపాలీని అతి దారుణంగా పొడిచాడు.
గాయాలు తీవ్రంగా కావడం వల్ల రుపాలీ అక్కడికక్కడే మృతి చెందింది. అక్కడి నుంచి పరారైన ఇక్బాల్‌కు కొన్ని గంటల్లోనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Source: EtvBharat





