-
ఘనత సాధించిన ఆంధ్రా విశ్వవిద్యాలయం
విశాఖపట్నం: మారుతున్న జీవనశైలి కారణంగా మధుమేహం బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవల్స్‌ను తెలుసుకునేందుకు ఖర్చుతో కూడిన పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటికి భిన్నంగా టైప్–2 షుగర్‌ను క్షణంలోనే తెలుసుకునేలా, అతి తక్కువ ఖర్చుతో అందరికీ అందుబాటులో ఉండేలా ఆంధ్రా యూనివర్సిటీ బయోకెమిస్ట్రీ విభాగం పోర్టబుల్ నానో బయోసెన్సార్ పరికరాన్ని ఆవిష్కరించింది.
ఏయూ బయోకెమిస్ట్రీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పూసర్ల అపరంజి పూర్తి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో తయారు చేసిన ఈ పరికరం పెన్‌డ్రైవ్ తరహాలో సుమారు 5 సెం.మీ. పరిమాణంలో ఉంటుంది. దీనికి వినియోగించే స్ట్రిప్ ఒక సెం.మీ. మాత్రమే ఉంటుంది. సాధారణంగా షుగర్ స్ట్రిప్స్‌ను ఒకసారి వాడి పడేయాలి. కానీ, ఈ లేబుల్ ఫ్రీ స్ట్రిప్‌ను బయో ఫ్యాబ్రికేషన్‌తో తయారు చేయడం వల్ల ఆరు నెలలపాటు ఎన్నిసార్లు అయినా వినియోగించుకోవచ్చు.