ArticlesNews

విమోచనపై వివాదమెందుకు?

288views

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని వివాదం చేయడం విషాదకరం. అది తెలంగాణ ప్రజల్ని అగౌరపరచడమే తప్ప మరొకటి కాదు. పెద్ద ఎత్తున ఉద్యమాలు, ఆందోళనలు, పోరాటాల పరాకాష్టగా సైనిక చర్య/ పోలీసు చర్య విజయవంతమై వందల ఏళ్ల తెలంగాణ ప్రజల బానిస సంకెళ్ళు పటాపంచలైన 1948 సెప్టెంబర్ 17 ను విమోచన దినంగా పాటించడమే సబబుగా, ధర్మంగా ఉంటుంది.

కానీ ఈ పవిత్ర త్యాగఫలంపై వివాదాలతో అత్యంత విలువైన కాలాన్ని, శక్తిని వృధా చేస్తుండడం దారుణాతి దారుణం. చారిత్రాత్మక – సాహసోపేతమైన సైనిక/ పోలీసు చర్య అనంతరం ఈ పోరాటాల పురిటిగడ్డ విలీనమయిందనో, సమైక్యతను సాధించిందనో అనడంలో ఇసుమంత కూడా సత్యం లేదు.

ఎవరైనా, ఎప్పుడైనా వాస్తవిక దృష్టి కోణం నుంచి తిలకించి, ఆలోచించడమే సముచితంగా ఉంటుంది. దీన్ని విస్మరించి ఏవో ప్రయోజనాలు ఆశించి, లబ్ధి పొందాలనుకోవడం, త్యాగ ఫలాన్ని హైజాక్ చెయ్యాలనుకోవడం సభ్యత కాదు. తెలంగాణ విమోచన అనంతరం దశాబ్దంన్నర కాలానికి పోర్చుగీసు పాలకుల నుంచి గోవా, మరికొన్ని ద్వీప కల్పాలు సైతం ఇదే తరహా సైనిక చర్యతో విముక్తి పొందాయి.

గోవా విముక్తి ఉద్యమం

1961 అనంతరం గోవా విమోచన దినోత్సవాన్ని ప్రతియేటా డిసెంబర్ 19న నిర్వహించుకుంటున్నారు. అక్కడి ప్రజలకు అనేకులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గోవాలో విమోచన దినోత్సవాల్ని అంగరంగ వైభవంగా, శోభాయమానంగా, స్పూర్తిమంతంగా జరుపుకుంటున్నప్పుడు తెలంగాణ విమోచన దినాన్ని ఆ పేరుతో నిర్వహించుకోవడానికి అభ్యంతరాలు, అసంతృప్తి వ్యక్తం చేయడంలో ఏదో “తెగులు” ద్యోతకమవుతోంది. గోవా లిబరేషన్, తెలంగాణ లిబరేషన్ ఒకే తరహాలో జరిగినప్పుడు, విమోచన దినోత్సవాన్ని కూడా ఒకే తీరులో భవిష్యత్ తరాలకు ఉత్ప్రేరకంగా నిలిచేలా జరుపుకోవడమే సముచితం తప్ప ఈ తగవులు – వివాదాలు తెలంగాణ ప్రజల్ని నిరాశ – నిస్తేజానికి గురిచేస్తాయన్న ఇంగితం అందరికీ ఉండాలి. కాలం గడుస్తున్న కొద్దీ మానసిక పరిపక్వత పెరుగుతుందంటారు. అదేమిటో కానీ తెలంగాణ విమోచన వజ్రోత్సవాలు/ అమృతోత్సవాల ప్రారంభ వేళ ఈ వివాదం మరింత ముదిరి పాకాన పడటం అభ్యంతరకరం, అవివేకం కూడా.

ప్రస్తుత తెలంగాణ పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలలోని ఎంతో భూభాగం ఒకప్పటి హైదరాబాద్ స్టేట్ (నిజాం సంస్థానం) లో ఉండేది. తెలంగాణ ప్రాంతం తో పాటు ఆ ప్రాంతాలు సైతం అదే రోజున నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందాయి. అటు కర్ణాటకలోని బీదర్, రాయచూర్, బళ్లారి, కొప్పాల్ లాంటి జిల్లాలను ఇప్పటికీ హైదరాబాద్ – కర్నూల్ ప్రాంతంగా వ్యవహరిస్తారు. అలాగే మహారాష్ట్రలోని మరాట్వాడా ప్రాంతాలైన ఔరంగాబాద్, జాల్నా, పర్బనీ, ఉస్మానాబాద్, బీడ్ తదితర ప్రాంతాల ప్రజలు తమ విముక్తిని విమోచన దినోత్సవంగానే నిర్వహించుకుంటున్నారు. కర్ణాటక – మహారాష్ట్రలలోకన్నా తెలంగాణలోనే నిజాంకు వ్యతిరేకంగా, ఎక్కువ పోరాటాలు జరిగాయి. ప్రజలు అసంఖ్యాకంగా ఇందులో పాల్గొన్నారు. సాధారణ రైతులు, కూలీలు, వర్తకులు, విద్యార్థులు, అధ్యాపకులు, ఆలోచనాపరులు, భాషాభిమానులు, ఆధునికతను ఆహ్వానించేవారు మూకుమ్మడిగా అనేక పోరాటాలు జరిపిన ఫలితమే పోలీసు చర్య – తెలంగాణ విమోచన. తెలంగాణ తో పాటు పొరుగు రాష్ట్రాల భూభాగాల్లోని ప్రజలు సైతం స్వేచ్ఛా వాయువులు పీల్చారు. ఇదీ చరిత్ర. సజీవ చరిత్ర. దీనిని ఎవరు వక్రీకరించ పూనుకున్నా వారు క్షమార్హులు కారు.

నిజాం రాజుకు వ్యతిరేకంగా ఆయన పాలన అంతం కావాలని, నిజాంకు మద్దతుగా నిలచిన రజాకార్ల అరాచకాలకు సమాధి కట్టాలని, షోయబుల్లాఖాన్ లాంటి పాత్రికేయుడు, బందగీ లాంటి సాధారణ రైతు ప్రాణత్యాగం చేశారు. ఆంధ్ర మహాసభ, ఆర్య సమాజ్, హిందూ మహాసభ, గ్రంథాలయోద్యమకారులు, దాశరథి, సురవరం, మాడపాటి లాంటి ఎందరో మేథావులు, కవులు, రచయితలు, పండితులు నిజాం నుంచి విమోచన కోసం గళమెత్తారు. రజాకార్ల కాల్పులకు, ఊచకోతలకు, దౌర్జన్యాలకు దీటుగా సమాధానమిచ్చిన ఎందరో సాహసులు – సాధారణ మహిళలు బైరాన్ పల్లి, నిర్మల్, పరకాల తోపాటు అనేకచోట్ల కనిపిస్తారు. ఆనాడు తెలంగాణ సమాజం మొత్తం పిడికిలెత్తి ఉద్యమించిన తీరు, రజాకార్ల వ్యతిరేక ప్రజా ఉద్యమ వీరుల త్యాగాలు చిరస్మరణీయం.

వందేమాతరం రామచంద్రరావు, రామానంద తీర్థ, నారాయణ రావు పవార్, రాంజీ గోండు, కొమురం భీమ్, మండుమల నర్సింగరావు ఇలా ఎందరో వీరుల పాత్ర సైతం ఈ బృహత్ విమోచనోద్యమంలో ప్రముఖంగా కనిపిస్తుంది. ఏ ఒక్కరినీ తక్కువ చేసి చూపలేం. ఒక్కొక్కరి ప్రత్యేక నైపుణ్యం, శక్తి, సామర్థ్యం, బుద్ధికుశలత ఆ మహోద్యమాన్ని నిర్మించింది. దీనిని గమనించి అప్పటి కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ సైనిక చర్య/ పోలీసు చర్యకు ఆదేశించారు. జనరల్ చౌదరి నేతృత్వంలో అటు షోలాపూర్ నుంచి, ఇటు విజయవాడ నుంచి సూర్యాపేట మీదుగా హైదరాబాదుకు యుద్ధ ట్యాంకులు, సైనిక వాహనాలు, పటాలాలు చేరుకునేసరికి నిజాం చేతులెత్తేశాడు. ఆయన సైనికాధికారి అరబ్బు ఆండ్రూస్ సహా అందరూ లొంగిపోయారు. చివరకు 1948 సెప్టెంబర్ 17న నిజాం సంస్థానంలో త్రివర్ణ స్వేచ్ఛా పతాకం రెపరెపలాడింది.

ఈ వీరోచిత – సాహస సంగ్రామాన్ని అంతే ఉత్తేచితంగా స్మరించుకుంటూ…. వివాదాలు మాని ఆనాటి వీరులకు, త్యాగధనులకు వందనాలు తెలపడం మనందరి కనీస కర్తవ్యం.

– వుప్పల నరసింహం, సీనియర్ జర్నలిస్టు,
9985781799.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.