సులభ రుణాల పేరిట ప్రజలను వేధిస్తున్న చైనా లోన్ యాప్స్ కు సంబంధించిన సొమ్మును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ స్తంభింపజేసింది. పేమెంట్ గేట్‌వేలు అయిన ఎస్ బజ్,రోజర్ పే, క్యాష్ ఫ్రీ, పేటీఎంలలో ఉంచిన రూ.46.67 కోట్ల సొమ్మును మనీలాండరింగ్ నిరోధక చర్యల కింద ఈడీ నిలిపివేసింది. చైనా కేంద్రంగా పనిచేస్తున్న రుణ యాప్స్, ఇతర ఇన్వెస్ట్‌మెంట్ టోకెన్లపై ఈ వారంలో ఈడీ దాడులు చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ, ముంబయి, ఘజియాబాద్, లఖన్ వూ లలో లోన్ యాప్స్ కు చెందిన పలు సైట్ లపై సెప్టెంబర్ 14న దాడులు జరిగాయి. దీంతోపాటే హెచ్ పీ జెడ్, దాని అనుబంధ సంస్థలకు లావాదేవీలు జరిపే బ్యాంకులు, పేమెంట్ గేట్ వే లకు చెందిన 16 సైట్ లలో కూడా ఈ తనిఖీలను నిర్వహించారు.
ఈ తనిఖీల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకొన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఓ ప్రకటనలో పేర్కొంది. ”లోన్ యాప్స్ కుంభకోణంతో సంబంధం ఉన్న సంస్థలకు పలు పేమెంట్ అగ్రిగేటర్లలో వర్చువల్ ఖాతాలు ఉన్నాయి. వీటిల్లో భారీ మొత్తంలో నగదు నిల్వ ఉంది. ఈజీబజ్ ప్రైవేట్ లిమిటెడ్ లో రూ.33.36 కోట్లు, రోజర్ పే సాఫ్ట్‌వేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రూ.8.21 కోట్లు, క్యాష్ ఫ్రీ పేమెంట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ లో రూ.1.28 కోట్లు, పేటీఎం పేమెంట్స్ సర్వీసెస్ లిమిటెడ్ లో రూ.1.11 కోట్లు ఉన్నాయి” అని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. మొత్తం రూ.46.67 కోట్లను స్తంభింపజేసినట్లు వెల్లడించింది. 2021 అక్టోబర్‌లో నాగాలాండ్ లోని కోహిమా సైబర్ యూనిట్ నమోదు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు దర్యాప్తు జరుగుతోంది.
కోవిడ్ వ్యాప్తి తర్వాత ఇన్‌స్టెంట్ లోన్ యాప్స్‌పై ఫిర్యాదులు భారీగా పెరిగాయని పుణె సైబర్ పోలీసులు వెల్లడించారు. 2019లో 322 ఫిర్యాదులు వస్తే.. అదే 2022లో ఇప్పటి వరకు 3151 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.
అక్రమ రుణ యాప్స్ ఆగడాలను అడ్డుకోవాలని కేంద్రం ఇప్పటికే నడుం బిగించింది. ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకొన్నారు. చట్టబద్ధంగా రుణాలు ఇచ్చే యాప్ ల జాబితాను ఆర్‌బీఐ రూపొందించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అదే సమయంలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సదరు యాప్స్ మాత్రమే యాప్ స్టోర్లలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఒక నిర్ణీత గడువు నిర్ణయించి పేమెంట్ అగ్రిగేటర్లంతా ఆర్‌బీఐ వద్ద రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. గడువులోగా నమోదైన పేమెంట్ అగ్రిగేటర్లను మాత్రమే కార్యకలాపాలు సాగించేందుకు అనుమతించాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.