News

కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ తమిళసై నిప్పులు

263views

భాగ్య‌న‌గ‌రం: కేసీఆర్ ప్రభుత్వంపై మరోసారి గవర్నర్ డాక్ట‌ర్‌ తమిళసై సౌందరరాజన్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత వివక్ష చూపించినా, గౌరవం ఇవ్వకపోయినా తన పని తాను చేసుకుని పోతానని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ గవర్నర్‌గా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజభవన్‌లో గవర్నర్ మాట్లాడుతూ తనకి ఎవరిపై వ్యక్తిగత ద్వేషం లేదని, తనకి గౌరవం ఇవ్వకపోతే, తానేమీ తక్కువ కాదని చెప్పారు. గవర్నర్‌గా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా తన పని తాను కొనసాగిస్తానని గవర్నర్ స్పష్టం చేశారు.

తెలంగాణ సమస్యలు పరిష్కరించుకునేందుకు సీఎం కేసీఆర్ అన్ని అవకాశాలను వదులుకుంటున్నారని ఆమె అన్నారు. కేంద్రం వివక్ష చూపుతోందని పదే పదే చెబుతున్న కేసీఆర్ దక్షాణాది రాష్ట్రాల సీఎంల సమావేశానికి ఎందుకు వెళ్ళ‌లేదని ఆమె ప్రశ్నించారు. సమస్యలను ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. నిద్రపోయేవాళ్ళ‌ని లేపొచ్చు. నిద్రపోతున్నట్టు నటించేవాళ్ళ‌ని లేపలేమని ఆమె ఎద్దేవా చేశారు. కేంద్రంతో బ్లేమ్ గేమ్ ఆడటం మంచిది కాదని ఆమె హితవు ప‌లికారు.

“గవర్నర్‌గా నా పరిధి మేరకు పనిచేస్తున్నా. ఏనాడూ నా పరిధి దాటి ప్రవర్తించలేదు” అని డాక్ట‌ర్‌ తమిళసై స్పష్టం చేశారు. గవర్నర్ కార్యాలయంపై తీవ్ర వివక్ష చూపుతున్నారని అంటూ ఎట్ హోం వస్తున్నానని సమాచారం ఇచ్చిన ముఖ్యమంత్రి అకస్మాత్తుగా రద్దు చేసుకోవడం మంచి పద్దతేనా? అని ఆమె ప్రశ్నించారు. రాజ్ భవన్ ఏమైనా అంటరాని స్థలమా? అంటూ ఆమె విస్మయం వ్యక్తం చేశారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి