
-
ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
-
విచారణ చేస్తున్న పోలీసులు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ఎంపీకి వ్యక్తిగత కార్యదర్శినంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పక్కనే అనుమానాస్పదంగా తిరిగిన వ్యక్తిని ముంబయి పోలీసులు అరెస్టు చేశారు. అతడ్ని గిర్గావ్ కోర్టులో హాజరుపరచగా.. న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి పంపింది. ఈ నెల అయిదోతేదీన జరిగిన ఈ ఘటన గురించి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అమిత్ షా రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ముంబయిలో పర్యటించారు. నగరంలోని ప్రముఖ గణేశ్ మండపాల్ని సందర్శించారు. ఆ తర్వాత పురపాలక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కార్యకర్తల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో భద్రతా లోపం తలెత్తినట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు.
ఓ వ్యక్తి అమిత్ షాకు అతి దగ్గరగా, చాలా సేపు తిరుగుతూ ఉన్నట్టు అధికారులు గమనించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయట పడింది. నిండితుడు మహారాష్ట్రలోని ధూలెకు చెందిన హేమంత్ పవార్‌గా గుర్తించారు. మలబార్ హిల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, న్యాయస్థానం ఆదేశాలతో రిమాండ్‌కు తరలించారు.
హోం మంత్రిత్వ శాఖ గుర్తింపు కార్డు ధరించినందు వల్ల అతనిపై అనుమానం రాలేదని అధికారులు అన్నారు. అమిత్ షా భద్రతా సిబ్బంది జాబితాలో అసలు నిండితుడి పేరు లేదని, అయితే అతడు గంటల తరబడి ఆ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించే అధికారిలా తిరుగాడినట్టు సమాచారం. ఈ వ్యక్తి ఇదివరకే మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ శిందే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఇంటి చుట్టూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారిని అని చెప్పుకుని తిరిగాడని పోలీసులు వెల్లడించారు.





