
భాగ్యనగరం: భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని నిరసిస్తూ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన సాగర హారం కార్యక్రమాన్ని పోలీసులు అరెస్టులు అక్రమ కేసులతో అణిచి వేసే క్రమంలో ఉత్సవ సమితి నాయకులను, వందలాది మంది కార్యకర్తలను అరెస్టు చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లలో నిర్భందించారు.
ప్రభుత్వం ఏర్పాట్లపై స్పష్టమైన హామి ఇచ్చేవరకూ ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నామని రాం గోపాల్ పేట పోలీస్ స్టేషన్ లో అరెస్టులో ఉన్న ఉత్సవ సమితి ఉపాధ్యక్షులు ఎం. రామరాజు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ భగవంత్ రావు, కేంద్ర కమిటి సభ్యులు టిఎన్ మురారి ప్రకటించారు.
వారు, ఆమరణ నిరాహార దీక్షకు దిగగా సాయంత్రం పోలీసులు బలవంతంగా ఉత్సవ సమితి కార్యాలయం బహేతి భవన్ లో వదిలి వెళ్ళగా వారు కార్యాలయం లోనే దీక్షను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఉత్సవాలకు సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు.
హిందూ ధార్మిక హక్కును కాపాడటానికి ఉత్సవ సమితి చేస్తున్న ఉద్యమానికి హిందూ సంస్థలు, ప్రజా ప్రతినిధులు, రాజకీయాలకు అతీతంగా యావత్ హిందూ సమాజం సంఘీభావం పలికి ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపిచ్చింది.
Source: Nijamtoday





