
న్యూఢిల్లీ: న్యాయస్థానాలు నిరాడంబరంగా ఉండాలని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ పేర్కొన్నారు. తీర్పుల ద్వారానే దిద్దుబాటు చర్యల్ని తీసుకోవాలన్నారు. కొందరు మాత్రం కోర్టులు ప్రతిపక్షాల పాత్ర పోషించాలనో.. లేదంటే వాటికి అండగా నిలవాలనో కోరుకుంటున్నారని చెప్పారు. అదే జరిగితే కోర్టుల ఔచిత్యం, వాటి రాజ్యాంగ పరిధిపై విస్తృత ప్రశ్నలు తలెత్తుతాయన్నారు.
‘కేపిటల్ ఫౌండేషన్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ వి.ఆర్.కృష్ణయ్యర్ అవార్డును ఆయన స్వీకరించారు. ఆ సంస్థ వార్షిక ఉపన్యాస కార్యక్రమంలో మాట్లాడారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు ఈ సొసైటీ జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేశారు.
“ప్రజాప్రయోజన వ్యాజ్యాల విధానాన్ని సుప్రీంకోర్టే ఆవిష్కరించింది. అది ప్రజలను న్యాయస్థానాలకు మరింత దగ్గర చేసింది. అప్పుడప్పుడు దుర్వినియోగం అవుతున్నంత మాత్రాన ఆ సానుకూల ప్రయోగాన్ని కోర్టులు పక్కనపెట్టాలా? అన్న ప్రశ్నా ఉదయిస్తోంది. ఏ వ్యవస్థ అయినా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిందే. దానిని కోల్పోతే వాటికి సమాజంలో స్థానం ఉండదు. అందుకు న్యాయవ్యవస్థ కూడా అతీతం కాదన్నది నా అభిప్రాయం” అని జస్టిస్ రమణ చెప్పారు.