
* నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు
* చికిత్స పొందుతూ యువతి మృతి
ఝార్ఖండ్లోని దుమ్కాలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. తన ప్రేమను అంగీకరించలేదని యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఓ దుండగుడు. 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆగస్టు 23న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుమ్కా పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న అంకిత(19)ను షారుక్ హుసేన్ అనే యువకుడు ప్రేమించాలంటూ వేధింపు లకు గురిచేసేవాడు. అందుకు అంకిత అంగీకరించకపోవడంతో ఆగస్టు 23న వేకువజామున ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటాక (ఆదివారం తెల్లవారుజామున 2.30 గంట లకు) అంకిత మరణించింది. ఈ విషయం బయటకు తెలియడంతో దుమ్కాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భాజపా, భజరంగ్ దళ్ కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి నిరసనలు తెలిపారు. నగరంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలను మూసేశారు. అధికారులు ముందుజాగ్రత్త చర్యగా దుమ్కా సబ్ డివిజన్లో 144వ సెక్షన్ విధించారు. “అతను కొన్ని రోజుల క్రితం ఫోన్ చేశాడు. ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించాడు. మంగళవారం ఉదయం మంచంపై ఉన్న నాకు కాలిన వాసన వచ్చింది. అనంతరం కళ్లు తెరిచి చూడగా అతడు పారిపో వడం కనిపించింది. ఇంతలో మంటలు అంటుకోవడంతో ఆ బాధతో విలవిల్లాడుతూనే.. మా నాన్న గదిలోకి వెళ్లాను. నా తల్లిదండ్రులు మంటలను ఆర్పి నన్ను ఆసుపత్రిలో చేర్పించారు” అని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన మరణ వాంగ్మూలంలో పేర్కొన్నారు.





