
నాగ్‌పూర్: సమాజానికి దీపపు వత్తిలా భారతీయ స్త్రీ వెలుగునిస్తోందని రాష్ట్ర సేవికా సమితి చీఫ్ శాంతక్కా జీ అన్నారు. నాగ్‌పూర్‌లోని రాష్ట్ర సేవికా సమితి మూడో చీఫ్ ఉషా తై చాటి వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత మహిళా చరిత్ర నిధి మొదటి సంపుటం ‘ప్రాచీన భారత దేశం’ ను సంఘమిత్ర సేవా ప్రతిష్ఠాన్ సేవిక ప్రకాశన్ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ(ఆర్.ఎస్.ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్‌జీ భాగవత్, శాంతక్కా జీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శాంతక్కా మాట్లాడుతూ.. భారతీయ స్త్రీ తన బాధలను తనలోనే ఉంచుకుని, సమాజం కోసం దీపపు వత్తిలా వెలుగునిస్తుంది. అలాంటి పాత్రలు వందలాది మన ముందు ఉన్నాయి. అందుకే స్త్రీలను శక్తి స్వరూపులు అంటారు. ఏ గొప్ప కార్యానికైనా అందరినీ కూడగట్టడం, అందరినీ వెంట తీసుకువెళ్ళడం అంత తేలికైన విషయం కాదు. దీనికి సహనం అవసరం. ఈ సహజసిద్ధమైన గుణం భారతీయ స్త్రీలలో ఉందని శాంతక్కా అన్నారు.
వేదాలు, రామాయణం, మహాభారతం నుండి నేటి వరకు ఉన్న స్త్రీ పాత్రల ఉదాహరణలు ఈ పుస్తకంలో ఉన్నాయి. నేటికీ భారతీయ స్త్రీ ఇలాగే ఉంది.. ఈ పుస్తకాన్ని దేశంలోని ప్రతి మూలకు చేర్చడం మనందరి కర్తవ్యమన్నారు.
Source: VSKBharat





