
75 ఏళ్ల స్వతంత్ర భారతం అమృతోత్సవాలకు సిద్ధమవుతోంది. సుమారు రెండు శతాబ్దాల పాటు ఆంగ్లేయులతో అనితర సాధ్య, అవిరళ, అవిశ్రాంత పోరాటం సాగించిన భారతీయ స్వాతంత్ర్య పోరాట యోధులను ఎందరినో నేడు మనం స్మరించుకుంటూ ఉన్నాం. వారిలో గత ఏడున్నర దశాబ్దాల కాలంలో విస్మరణకు గురి అయిన అవిస్మరణీయ యోధులెందరో ఉన్నారు. నేడు అట్టి వారెందరికో సముచిత గుర్తింపు, గౌరవం లభిస్తున్నాయి.
ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారత ప్రస్థానంలో ఎన్నో విజయాలు, పరాజయాలు, పరాభవాలు, ఆవిష్కరణలు ఉన్నాయి. ఈ అమృతోత్సవ వేళ వాటన్నిటినీ కాకపోయినా కనీసం కొన్నిటినైనా సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని ఏటేటా సంబరాలు చేసుకుంటున్నాం. కానీ ఆ స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందే దేశం రెండు ముక్కలయిందన్న సంగతి మరచిపోయాం. వేలాది మంది హిందువులు ప్రాణాలు కోల్పోయిన సంగతి, వేలాది మంది మానవతులు బహిరంగంగానే చెరచబడ్డ సంగతి, లక్షలాదిమంది ప్రజలు స్వదేశంలోనే నిరాశ్రయులుగా, శరణార్థులుగా జీవించాల్సి వచ్చిందన్న సంగతి మన పాఠ్యాంశాలలో, చరిత్ర పుస్తకాలలో చాలా సంక్షిప్తంగానే కనిపిస్తుంది. ఆ వెనువెంటనే, మన నాయకులు కేటాయించిన నిధులతోనే ఆయుధాలు సమకూర్చుకుని మన దేశంపైకే దండయాత్రకు వచ్చి 13, 297 చదరపు కిలోమీటర్ల మన భూభాగాన్ని దురాక్రమించిన పాపిష్టి పాకిస్థాన్ ను మన పత్రికలలో, పుస్తకాలలో ఇప్పటికీ దాయాది దేశంగా నిస్సిగ్గుగా అభివర్ణించుకుంటున్నాం. మన దేశంపైకి దండయాత్ర చేసి 43 వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని దురాక్రమించిన జిత్తులమారి చైనా నాయకత్వాన్ని, వారి పాలనను నిస్సిగ్గుగా శ్లాఘించడమే కాక, వారి పాలనను ఆదర్శంగా తీసుకోవాలని మన నాయకత్వానికి సలహాలిచ్చే మేథావులకూ మనదేశంలో కొదవ లేదు.
ఎప్పటి సంగతో ఎందుకు? 30 ఏళ్ల క్రితం కాశ్మీర్ వ్యాలీ నుంచి లక్షలాది మంది హిందువులు కన్నీళ్లతో, కట్టుబట్టలతో స్వంత నేలను వదిలి, పొట్టకూటి కోసం కూలీనాలీ చేసుకుంటూ, దేశంలోని వివిధ ప్రాంతాలలో బ్రతుకులీడ్చిన సంగతి నిన్న మొన్న ‘కాశ్మీర్ ఫైల్స్’ సినిమా విడుదలయ్యే వరకూ దేశంలో చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మన దేశంలోని చరిత్రకారులు, మీడియా ఏనాడూ ఇలాంటి నిజాలను నిక్కచ్చిగా ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చెయ్యలేదు. నాయకుల ఉదాసీనత, రాజకీయ కక్కుర్తి కారణంగా ఆ భూభాగాన్ని కాపాడడానికి దశాబ్దాలపాటు అక్కడి దుర్మార్గుల రాళ్ల దెబ్బలను భరిస్తూ తలలు పగిలి, కాళ్ళు, చేతులు విరిగి క్షతగాత్రులుగా మారిన భారతీయ వీర సైనికుల దీన గాథలు అసలెవరికీ తెలీదు. ప్రభుత్వాలు, పత్రికలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు.
అంతేకాదు దశాబ్దాలపాటు పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల నుంచి గుట్టుచప్పుడు కాకుండా గుట్టలుగుట్టలుగా దేశంలోకి చొరబడిన అక్రమ చొరబాటుదారుల లెక్కలు మనకు పక్కాగా తెలీదు. వారి రాకడతోనూ, అడ్డూ అదుపూ లేకుండా ఉద్దేశ్యపూర్వకంగా తమ జనాభాను లెక్కకు మిక్కిలిగా పెంచుకుంటూ పోయిన మన దేశంలోని అదే వర్గం ప్రజల పోకడతోనూ హిందువులు ఎక్కడికక్కడ గప్ చుప్ గా బిచాణా సర్దుకుని ఎక్కడెక్కడికో పారిపోయిన, పారిపోతున్న వైనం అసలెవరికీ ఎరుకే లేదు. ఇక మరోవైపు విచ్చలవిడిగా వచ్చి పడుతుండిన విదేశీ నిధుల దన్నుతో అమాయక హిందువులే లక్ష్యంగా చాపకింద నీరులాగా దేశంలోని మూల మూలలకూ ప్రాకి కోట్లాది మందిని మతం మార్చిన, మారుస్తున్న క్రైస్తవం కుట్రలకు మనదేశంలో అంతూ పొంతూ లేనే లేదు.
అంతటితో ఆగారా? ఇస్లామిక్, ఖలిస్థాన్, మావోయిస్టు, LTTE, నాగా, బోడో వంటి ఎన్నెన్నో వేర్పాటువాదాలను మనదేశంలో కులాల, మతాల, జాతుల, ప్రాంతాల, భాషల వారీగా కొన్ని స్వదేశ, విదేశ శక్తులు పెంచి పోషించాయి, పోషిస్తున్నాయి.
అయితే స్వతంత్ర భారత చరిత్ర సాంతం ఇలాంటి చేదు నిజాల సమాహారమేనా? విజయగాథలు, ప్రగతి పథాలు లేవా? ఖచ్చితంగా ఉన్నాయి. పండిట్ నెహ్రూ హయాంలోనే అటామిక్ రీసెర్చ్ సెంటర్ నెలకొల్పబడింది. విక్రమ్ సారాభాయ్ నేతృత్వంలో ISRO రూపుదిద్దుకుంది. ఎన్నో అభివృద్ధి పథకాలు, ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయి. ప్రపంచ దేశాలతో స్నేహ పూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి. పరస్పర సహకారమూ మొదలైంది. నెహ్రూ తనయ ఇందిర హయాంలో చైనా చేసిన దురాక్రమణ యత్నాన్ని మనం సమర్థవంతంగా తిప్పికొట్ట గలిగాం. అటల్ బిహారీ వాజ్ పాయ్ హయాంలో అణు పరీక్షల ద్వారా భారత్ ఆయుధ పాటవాన్ని ప్రపంచానికి చాట గలిగాం. కార్గిల్ కొండల మాటునుంచి దొంగ దెబ్బ తీయాలని చూసిన గుంట నక్క పాకిస్థాన్ ను చావు దెబ్బ తీశాం.
ఇక మన నేటి మేటి ప్రధాని నరేంద్ర మోడీ హయాంలో నయా భారత్ ఆవిష్కృతమవుతోంది. నిన్నగాక మొన్న సర్జికల్ స్ట్రైక్స్ తో పాక్ బాకీ తీర్చుకున్నాం. శాటిలైట్లు ప్రయోగించాలంటే విదేశాలపై ఆధారపడే స్థితి నుంచి ఇప్పుడు మన అంతరిక్ష కేంద్రం నుంచి విదేశీ ఉపగ్రహాలను ప్రయోగిస్తున్నాం. మనకు మనమే సొంతంగా ఆయుధాలు తయారు చేసుకోవటమే కాక ప్రపంచ దేశాలకు సైతం ఎగుమతులు చేయగలుగుతున్నాం. ప్రపంచంలోని అనేక దేశాలు స్వయంగా తామే ఎదురొచ్చి స్నేహ హస్తం చాచే బలీయమైన స్థితికి నేడు మనం చేరుకున్నాం.
ఆంగ్లేయుల పాలన కారణంగా 1947 నాటికి పేదరికం తాండవిస్తున్న దేశం నేడు 1,28,829 రూపాయల తలసరి ఆదాయాన్ని నమోదు చేస్తోంది. కోవిడ్ సంక్షోభంలో వివిధ దేశాలకు ఉచిత వ్యాక్సిన్ ను సరఫరా చేసి, ఆపదలో ఉన్న ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక వంటి దేశాలకు ఆహారాన్ని అందించి నేడు భారత్ ఆపద్బాంధవుడిగా రూపుదిద్దుకుంది. సరిహద్దులను బలోపేతం చేసుకుని శత్రు దేశాలు మన వైపు కన్నెత్తి చూడాలన్నా భయకంపితులయ్యే శక్తివంతమైన స్థితిలో మనం నేడు నిలిచి ఉన్నాం. అన్నిటికంటే మిన్నగా…. మన పరాజయానికి, బానిసత్వానికి, పరాయి పాలనకు సూచికగా, అవమాన చిహ్నంగా రామజన్మభూమి అయోధ్యలో 600 సంవత్సరాలపాటు నిలుచుని ఉండిన కళంకిత బాబ్రీ కట్టడం స్థానంలో భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా సాగుతూండడం మన పోరాట పటిమకు, స్వాభిమానానికీ సూచిక.
కానీ ఇప్పటికీ మన చుట్టూ అనేక సవాళ్ళు మోహరించి ఉన్నాయి. సరికొత్త రూపుతో మనపై దాడి చేయడానికి కాచుకు కూర్చున్నాయ్. కొన్ని అవాంఛనీయ శక్తులు అయిన దానికీ కాని దానికీ కయ్యానికి కాలు దువ్వుతున్నాయ్. రాళ్ల దాడులకు, హత్యలకు తెగబడుతున్నాయ్. దేశంలో అశాంతిని రేకెత్తించడానికి అనుక్షణమూ అవిశ్రాంతంగా కుట్రలు పన్నుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆ అసాంఘిక శక్తులన్నీ ఏకీకృతమై, ఏకోన్ముఖమై మూకుమ్మడిగా దాడి చేసే యత్నాలను ప్రారంభించాయ్. చిత్ర విచిత్ర వాదాలను తెర మీదకు తెచ్చి ప్రజలను ముక్కలు చేసే ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. గత కొంత కాలంగా కనుమరుగైపోయిన వేర్పాటువాద భావజాల చలనచిత్రాలను, సాహిత్యాన్ని ముమ్మరంగా ప్రజల ముందుకు తెస్తున్నాయి. అమ్ముడుపోయిన మీడియాను అడ్డం పెట్టుకుని తమ అజెండాను అమలు చేస్తున్నాయి.
అయితే ఇటీవల జరుగుతున్న అనేక పరిణామాలను గమనిస్తే ప్రజలు వీటన్నిటి పట్లా అప్రమత్తంగానే ఉన్నారని, వివేకవంతంగా వ్యవహరిస్తున్నారని తేటతెల్లం అవుతోంది. కానీ ఈ శక్తులు భవిష్యత్తులో తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంది. రాబోయే ఆ సవాలును స్వీకరించడానికి, సమైక్యంగా ఎదుర్కోవడానికి మనమంతా సిద్ధం కావాలి. ఈ అమృతోత్సవ వేళ మనం ఆ మేరకు సంకల్పం చెయ్యాలి. ధర్మానిదే అంతిమ విజయమని మరోసారి చాటాలి. భారత్ మాతాకీ జై.





