* ఆరెస్సెస్ సర్ కార్యవాహ శ్రీ దత్తాత్రేయ హోసబలే
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశంలోని ప్రతి పౌరుడూ ఆనందోత్సాహాలతో ఉన్నాడు. అన్ని అడ్డంకులనూ, సంక్షోభాలనూ అధిగమించి మన దేశం 75 సంవత్సరాల కాలఖండాన్ని దాటింది. ఈ ప్రయాణం అత్యంత రోమాంఛితమైనది. ఈ స్వాతంత్ర్య అమృతోత్సవ వేళ మన దేశం సాధించిన విజయాలు, అధిగమించిన సవాళ్లు అన్నీ మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి. దేశం స్వాతంత్ర్యం పొందిన వెంటనే విభజించబడింది. వెనువెంటనే… ఆ విభజన కారణంగా జరిగిన హింసాకాండను ఎదుర్కొంది. ఆ తర్వాత వెంటనే సరిహద్దు దాడులను ఎదుర్కొంది. అయితే ఈ సవాళ్లు ఏవీ మన దేశపు శక్తి సామర్థ్యాలను హరించలేకపోయాయి. ఈ సవాళ్ళన్నింటినీ ఓ ప్రక్క ఎదుర్కొంటూనే మన దేశం తన ప్రజాస్వామ్య పునాదులను పటిష్టం చేసుకోవడం కొనసాగించింది. విభజన, దండయాత్ర తర్వాత మన దేశ పౌరులు 1952లో గణతంత్ర దినోత్సవాలను ఘనంగా జరుపుకొని భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఎలా స్థాపించారో ఈ రోజు మనం ఊహించుకుంటే… ఓ అద్భుతంలా అనిపిస్తుంది.
1947 తర్వాత భారతదేశ ప్రజల బలము, సంకల్పాలకు ఇది ఒక తార్కాణం. భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలైన గోవా, దాద్రా నగర్ హవేలీ, హైదరాబాద్, పుదుచ్చేరిలను స్వతంత్ర భారతంలో విలీనం చెయ్యడానికి ప్రయత్నాలు జరిగాయి. చివరకు ప్రజల ఆకాంక్ష, పోరాటాల కారణంగా లక్ష్యాన్ని సాధించగలిగాం. కొన్నేళ్ల క్రితమే రాజకీయ స్వాతంత్య్రం పొందిన దేశం ఇవన్నీ ఇంత త్వరగా ఎలా సాధించగలిగిందన్న ప్రశ్న తరచుగా తలెత్తుతుంది. దీన్ని అర్థం చేసుకోవాలంటే భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవాలి. తన పైన ఎన్ని దాడులు జరిగినప్పటికీ, ఎన్ని సంక్షోభాలు ఎదురైనప్పటికీ భారతీయ సమాజం, తన ఐక్యతా సూత్రాన్ని మాత్రం మరచిపోలేదు. మనం భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని పరిశీలించినట్లయితే, ఆ పోరాటం దేశంలోని నగరాలు, గ్రామాలు, అడవులు, పర్వతాలు, తీర ప్రాంతాలలో… ఇలా అంతటా సాగిందని తెలుస్తుంది. సంథాల్ తిరుగుబాటు, దక్షిణాది వీరుల సాయుధ పోరాటం ఇలా అన్ని సంఘర్షణల్లోనూ ఒకే భావం కనిపిస్తుంది. ప్రజలందరూ స్వాతంత్య్రాన్ని కోరుకున్నారు. తమకు మాత్రమే కాదు, యావత్ సమాజానికీ, దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించాలని వారు కోరుకున్నారు. స్వాతంత్ర్యం కోసం భారతీయ సమాజం ఎలాంటి త్యాగాలనైనా చెయ్యడానికి, అన్ని రకాల మార్గాలనూ అనుసరించడానికి సిద్ధపడింది. ఆ కారణం చేతనే ఒక్క భారత్ లోనే కాక లండన్, యుఎస్, జపాన్ లలో కూడా ప్రయత్నాలు జరిగాయి. లండన్‌లోని ‘ఇండియా హౌస్’ భారత స్వాతంత్ర్య పోరాటానికి ఒక ప్రధాన కేంద్రంగా మారింది.
భారతదేశపు స్వాతంత్ర్య ఉద్యమం చాలా విస్తృతమైనది. అది దేశంలోని ప్రజల మధ్య ఉన్న భౌగోళిక, ఆర్థిక, సామాజిక అంతరాలను అధిగమించి, దేశ ప్రజలందరినీ ఏకం చేసింది. ఈ ఘనతను ఏ ఒక్కరికో ఆపాదించనవసరం లేదు. ఎందుకంటే భారత స్వాతంత్ర్యోద్యమంలో తమ ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించిన వారెందరో ఉన్నారు. వారిలో కొందరి పేర్లు మనకు తెలుసు. కొందరి పేర్లు తెలియదు. అసంఖ్యాకమైన నాయకులు సాగించిన ఉద్యమమది. కానీ అందరి లక్ష్యం ఒక్కటే. స్వాతంత్ర్య సాధన.
స్వాతంత్య్రానంతరం దేశాన్ని పరమవైభవం దిశగా నడిపించాలనే ఆలోచన దేశ ప్రజల మనసులలో ఉన్నా, దానికి రాజకీయ నాయకత్వంపై ఆధారపడలేదు. ఆ కారణంగా, దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎమర్జెన్సీ రూపంలో దాడి చేయడానికి ప్రయత్నించినప్పుడు, దేశ ప్రజలు దానిని ఎదుర్కొన్నారు. దానికి వ్యతిరేకంగా ఉద్యమించి పోరాడారు.
స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న ఈ సమయంలో, స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే సమయానికి మనం సాధించాల్సిన లక్ష్యాలేమిటనే విషయాన్ని మనం ఆలోచించాలి. ప్రపంచమంతా ఒకవైపు కరోనా సంక్షోభం, మరోవైపు అస్థిరతతో ఉన్న ఈ తరుణంలో, ఒక దేశంగా మన ముందున్న లక్ష్యాలేమిటి? అయితే గత దశాబ్ద కాలంలో మనం ఎన్నో విజయాలను సాధించామనటంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. భారతదేశంలోని పౌరులకు ఆరోగ్యం, గృహనిర్మాణం, ఆర్థిక సమృద్ధి వంటి ప్రాథమిక సౌకర్యాలను అందించే విషయాలే అయినా, ఇవన్నీ భారతీయ సమాజం సశక్తమవుతోందని, భారతీయ పౌరులు సాధికారత పొందుతున్నారనే విషయాన్ని తెలియపరుస్తాయి. కరోనా సమయంలో అతి తక్కువ సమయంలో అత్యంత చౌకైన, సురక్షితమైన వ్యాక్సిన్‌ను తయారు చేసిన మేధస్సు భారతీయులది. ప్రపంచం మొత్తానికి సహాయం చేసి కోట్లాది మంది ప్రాణాలను కాపాడగలిగాం.
ఇన్ని విజయాలు ఉన్నప్పటికీ, మనం, మన భారతీయ సమాజం ఒక దేశంగా, మనం మనకెదురయ్యే బాహ్య, అంతర్గత సంక్షోభాలను ఎదుర్కోవడమే కాకుండా, వాటిని శాశ్వతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం సమరసతా సాధన కోసం మరింతగా ప్రయత్నించాల్సి ఉంది. ఎందుకంటే సమాజంలో సమరసత ఎంత బాగుంటే సమాజం అంత బలంగా ఉంటుంది. అందువల్ల భారతీయ సమాజంలో సమరసతా సాధనకై మనం మరింత కృషి చేయవలసిన అవసరం ఉంది. ఇన్ని సంక్షోభాల అనంతరం కూడా ఈ రోజు భారత ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తోంది. అయితే భారతదేశంలో పెరుగుతున్న జనాభా ఆకాంక్షలకు అనుగుణంగా అది మరింత వేగంగా పురోగమించవలసి ఉంది. దీని కోసం మనం భారతీయ పరిశ్రమలు, సంస్థలను ప్రోత్సహించడం అవసరం. ఇది లేకుండా దేశపు ఉపాధి అంచనాలను నెరవేర్చలేము. భారతదేశం స్వయం సహాయకంగా ఉన్నప్పుడే భారతదేశం నిజంగా శక్తివంతమవుతుంది.
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి నేటికి 75 ఏళ్లు పూర్తవుతున్న తరుణంలో, భారతదేశ విధాన స్థాపన, ప్రస్తుత భారతదేశ ఆకాంక్షలు, అంచనాలకు అనుగుణంగా ఉందా లేదా అనే విషయాన్నికూడా మనం పరిశీలించుకోవాలి. అలా లేనట్లయితే, దానిని ఎలా మార్చవచ్చో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేటి న్యాయ వ్యవస్థ అయినా, రాజకీయ వ్యవస్థ అయినా ఒక సామాన్యుడు తనకు తాను అసౌకర్యంగా, అసహాయుడుగా భావించుకునే పరిస్థితులు ఈరోజు మనం చాలానే చూస్తున్నాం. న్యాయాన్ని, పాలనను సాధారణ పౌరులకు చేరువ చేసి, అవి వారికి సులభంగా అందుబాటులోకి వచ్చేలా చేయగలగాలి.
భారతదేశం తన పటిష్టమైన అంతర్గత వ్యవస్థతోనే ప్రపంచంలోని సవాళ్లనన్నింటినీ ఎదుర్కోగలదు. అంతర్గత వ్యవస్థ పటిష్టత కేవలం దేశం యొక్క ఆర్థిక, సామాజిక శక్తిపై మాత్రమే ఆధారపడి ఉంటుంది. భారతదేశ అంతర్గత వ్యవస్థ పటిష్టతకు పరిష్కారం దేశంలోని ఆర్థిక, సామాజిక సవాళ్లను పరిష్కరించడంలోనే ఉంది.