ArticlesNews

ఇరుపాపురంలో ఘనంగా సంగోలి రాయన్న జయంతి

207views

రోజు కర్నూలు జిల్లా హాలహర్వి మండలం ఇరుపాపుర గ్రామంలో జాతీయ సంగోలి రాయన్న సేన ఆధ్వర్యంలో, స్వాతంత్ర్య సమరయోధుడు ‘క్రాంతి వీర’ సంగోలి రాయన్న 226 వ జయంతి ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగోలి రాయన్న అభిమానులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు కె రాజు , కనక శ్రీ సంఘ సభ్యులు పి నీలకంఠ రెడ్డి, కె విరేశ్, జి రంగణ్ణ , జి మల్లణ్ణ , ఎచ్ రంగణ్ణ, జి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ సంగోలి రాయన్న సేన  తాలూకా అధ్యక్షుడు శ్రీ ఉమేష్ కార్యక్రమాన్ని ఆద్యంతమూ పర్యవేక్షించారు.

సంగోలి రాయన్న ఎవరు?

‘క్రాంతివీర’ గా పేరుపొందిన సంగోలి రాయన్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన తిరుగుబాటు వీరుడు. 1798 సం.ఆగస్ట 15 వ తేదీన కర్ణాటకలోని బెలాగావిలోని సంగోలిలో జన్మించాడు. ఏడడగులపైన ఎత్తుతో ఆజానుబాహుడు, ధృడకాయుడు. చిన్నతనంలోనే యుద్ధవిద్యలలో ప్రావీణ్యత సంపాదించి అప్పటి కిత్తూరును పరిపాలించే రాణి చెన్నమ్మ సైన్యంలో చేరి త్వరలో సైన్యాధ్యక్ష పదవికి ఎదిగాడు.

కిత్తూరు చెన్నమ్మ కూడా బ్రీటీష్ వారి నుండి తన రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం వీరోచితంగా పోరాడి మరణించిన వీరనారి. రాణి కిత్తూరు చెన్నమ్మ గౌరవార్థం ఈమె విగ్రహం పార్లమెంటు ప్రాంగణములో క్రీ.శ. 2007, సెప్టెంబరు 1న అప్పటి భారత ప్రథమ మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చే ఆవిష్కరింపబడినది.

సంతానంలేని కిత్తూరు చెన్నమ్మ శివలింగప్ప అనే బాలుడుని దత్తత తీసుకుంటుంది. ఈ దత్తత అంగీకరించని బ్రిటీష్ వారు సైన్యంతో కిత్తూరును ఆక్రమించేందుకు యుద్దానికి వచ్చారు.

ఆ యుద్ధంలో సంగోలి రాయన్న తన ఖడ్గ ఛాలనంతో విజృంభిస్తాడు. కానీ బ్రీటీష్ సైనిక బలగం ఎక్కువగా ఉండటంతో రాయన్న మరియు చెన్నమ్మ బందీలుగా చిక్కుతారు. కానీ రాయన్న పరాక్రమానికి మెచ్చుకుని బ్రిటీష్ వారు రాయన్నను విడచిపెట్టారు.

తరువాత బ్రిటీష్ వారి అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ప్రజల నుండి అధిక శిస్తులు వసూలు చేయసాగారు. రాయన్న అడవులకు వెళ్లి సొంతంగా సైన్యాన్ని తయారు చేసుకుని, తెల్లవారి తొత్తులైన జమీందారులను దోచుకుని ఆ సొమ్మును బీదలకు పంచిపెట్టాడు. బ్రిటీష్ వారి ఆఫీసులను తగులబెట్టాడు. వారి ఖజానాలను దోచుకున్నాడు.

ఇంతలో బ్రిటీష్ వారి చెరలో ఉన్న రాణి చెన్నమ్మ అశువులుబాసింది. రాయన్న దళాలు రగిలిపోయి బ్రిటీష్ వారిని నేరుగా ఎదుర్కునేందున తగిన సైన్యాన్ని సమకూర్చుకున్నారు.

బహిరంగ యుద్ధంలో రాయన్నకు తిరుగేలేకుండా పోయింది. రాయన్నను ముఖాముఖా యుద్ధంలో గెలవలేమని బ్రిటీష్ వారు కుట్ర చేసి రాయన్న అనుచరుడి సాయంతో, రాయన్న చేతిలో ఆయుధం లేనప్పుడు అదను చూసి బ్రిటీష్ సైనికులు బంధించారు. విచారణ జరిపి రాయన్నకు ఉరిశిక్ష విధించారు. 1831 సం. జనవరి 26వ తేదీన నందగడ్ జిల్లాలో మర్రిచెట్టుకు బహిరంగంగా ఉరితీశారు.

రాయన్న అనుచరులు ఆయన భౌతికా కాయన్ని నందగడ్ లో సమాధి చేసి గుర్తుగా మర్రిచెట్టును నాటారు. రాయన్న సమాధి 8 అడుగుల పొడవుంటుంది. మర్రిచెట్టు నేటికి చక్కగా పెరిగి పెద్దదయింది. చుట్టు ప్రక్కల గ్రామాల ప్రజలు రాయన్న లాంటి పుత్రుడు తమకు జన్మించాలని ఆ చెట్టుకు ఉయ్యాలలు కడతారు. సమాధికి దగ్గరలోనే ఆశోక స్తంభం కూడా ఏర్పాటు చేయబడింది. సంగోలి గ్రామంలోనే రాయన్నకు గుడి కూడా కట్టారు.

రాయన్న పుట్టిన రోజునే ఆగస్ట్ 15వ తేదీన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆయన ఉరితీయ బడ్డ రోజునే జనవరి 26న భారతదేశం రిపబ్లిక్ గా అవతరించింది. 2012వ సం.లో సంగోలి రాయన్న అనే సినిమాను కన్నడంలో నిర్మించి విడుదల చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.