న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక చట్టాన్ని ఉల్లంఘించేవారి భరతం పట్టడానికి ఏర్పాటైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గడచిన నాలుగేళ్ళలో నూతన జవసత్వాలను సంతరించుకుని రెట్టింపు బలం పుంజుకుంది. ఈ సంస్థ డైరెక్టర్‌గా సంజయ్ కుమార్ మిశ్రా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అధికారులు, సిబ్బంది పెరిగారు.
సంజయ్ కుమార్ మిశ్రా 2018లో ఈడీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అప్పట్లో ఈ సంస్థకు ఐదుగురు ప్రత్యేక డైరెక్టర్లు, 18 మంది జాయింట్ డైరెక్టర్లు ఉండేవారు. వీరంతా ఇండియన్ పోలీస్ సర్వీస్(ఐపీఎస్) అధికారులే. కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాల్లో పని చేసే అధికారులు ఈడీకి డిప్యుటేషన్‌పై వస్తూ ఉంటారు. అయితే, ప్రస్తుతం ఈడీకి తొమ్మిది మంది స్పెషల్ డైరెక్టర్లు, ముగ్గురు అడిషినల్ డైరెక్టర్లు, 36 మంది జాయింట్ డైరెక్టర్లు, 18 మంది డిప్యూటీ డైరెక్టర్లు ఉన్నారు.
మరోవైపు ఈ సంస్థకు డిప్యుటేషన్‌పై తీసుకురావడానికి ఆదాయపు పన్ను శాఖ, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్, కస్టమ్స్ అండ్ ఎక్సయిజ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు ప్రాధాన్యమిస్తున్నారు. అంతేకాకుండా ఈ సంస్థ తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ప్రాంతీయ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేసింది.
Source: Nijamtoday